సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌లో పాడైన బిర్యానీ వేడివేడిగా వడ్డింపు

  • ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో వెలుగుచూసిన దారుణ నిజాలు
  • అపరిశుభ్రంగా కిచెన్.. పాడైన ఆహార పదార్థాలు
  • లక్ష రూపాయల జరిమానా
తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తూ నాణ్యత లేని ఆహారాన్ని వినియోగదారులకు వడ్డిస్తున్న హోటళ్ల భరతం పడుతున్నారు. వారి తనిఖీల్లో వెల్లడవుతున్న దారుణాలు చూసి జనం విస్తుపోతున్నారు. పేరెన్నికగన్న హోటళ్లలోనూ అపరిశుభ్ర వాతావరణం, కుళ్లిన, పాడైన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు.

తాజాగా రెండ్రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫేమస్ ఆల్ఫా హోటల్‌పై ఆహార భద్రత టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పాడైపోయిన మటన్‌తో చేసిన బిర్యానీని గుర్తించారు. దానినే ఫ్రిడ్జ్‌లో పెట్టి వినియోగదారులకు వేడివేడిగా వడ్డిస్తున్నట్టు గుర్తించారు. 

హోటల్‌లో ఆహార భద్రత ప్రమాణాలు అస్సలు పాటించలేదని అధికారులు తెలిపారు. హోటల్ నిండా నాసిరకం ఆహార పదార్థాలు నిలువ ఉన్నాయని, కిచెన్ దుర్గంధంగా ఉందని పేర్కొన్నారు. ఆల్ఫా బ్రాండ్ బ్రెడ్ ప్యాకెట్లపై డేట్ లేకుండానే విక్రయిస్తున్నారని తెలిపారు. హోటల్‌కు నోటీసులు జారీచేసి, లక్ష రూపాయల జరిమానా విధించారు.


More Telugu News