కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. పంటల కనీస మద్దతు ధర పెంపు

  • 2024-25 ఖరీఫ్‌ సీజన్‌లో 14 పంటల కనీస మద్దతు ధర పెంపు
  • మహారాష్ట్రలో గ్రీన్ ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ పోర్టు అభివృద్ధికి రూ.75,200 కోట్ల కేటాయింపు
  • వారణాసిలో అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్
  • గుజరాత్, తమిళనాడులో విండ్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కేటాయింపు
  • కేంద్ర మంత్రివర్గం నిర్ణయం
పద్నాలుగు పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్రం కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం వరికి కనీస మద్దతు ధరను 5.35 శాతం మేర పెంచింది. జొన్న, పత్తి సహా 13 రకాల పంటల మద్దతు ధరనూ పెంచింది. కేబినెట్ భేటీ నిర్ణయాలను కేంద్ర రైల్వే, సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వరి కనీస మద్దతు ధర రూ.117 పెంచడంతో క్వింటాల్ ధాన్యం ధర రూ. 2,300కు చేరుకుంది. 

మద్దతు ధర పెంచడంతో పాటు కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహారాష్ట్రలో విధావన్ వద్ద గ్రీన్ ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ పోర్టును రూ.76,200 కోట్లతో అభివృద్ధి చేయాలని మోదీ సర్కారు నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే గ్రీన్‌ఫీల్డ్ పోర్టు.. ప్రపంచంలోనే టాప్ 10 పోర్టుల్లో ఒకటిగా నిలుస్తుంది. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. వారణాసిలో అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 2,870 కోట్లతో కొత్త టెర్మెనల్ నిర్మాణం, రన్‌వే విస్తరణకు ఆమోదం తెలిపింది. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో రూ.7,453 కోట్లతో 500 మెగావాట్ల సామర్థ్యంతో విండ్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 

కనీస మద్దతు ధర వివరాలు (పంట  - ధరలో పెంపు - మద్దతు ధర వివరాలు)
  • వరి (సాధారణం) - రూ.117  -  రూ.2,300
  • వరి (గ్రేడ్‌-ఎ)  -  రూ.117 -  రూ.2,320
  • జొన్న (హైబ్రిడ్‌)  -  రూ.191 -  రూ.3,371
  • జొన్న (మాల్దండి) -  రూ.196  -  రూ. 3,421
  • సజ్జలు  -  రూ.125  -  రూ.2,625
  • రాగులు  -  రూ.444  -  రూ.4,290
  • మొక్కజొన్న  -  రూ.135  -   రూ.2,225
  • వేరుశెనగ  -   రూ.406  -   రూ.6,783
  • కంది  -  రూ.550  -  రూ.7,550
  • మినుము  -   రూ.450  -  రూ.7,400
  • పెసలు  -  రూ.124  -  రూ.8,682
  • సోయాబీన్‌ (పసుపు)  -   రూ. 292  -  రూ.4,892
  • పొద్దుతిరుగుడు విత్తనాలు  -   రూ.520  -   రూ.7,280
  • నువ్వులు  -   రూ.632  -   రూ.9,267
  • పత్తి (మధ్యరకం)  -   రూ. 501  -   రూ.7,121
  • పత్తి (లాంగ్ స్టెపెల్‌)  -   రూ.501  -   రూ.7,521
  • నైజర్ సీడ్  -  రూ.983  -   రూ.8,717


More Telugu News