కడపలో అందుకే ఓడిపోయాను... హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే పోటీ చేశా: వైఎస్ షర్మిల

  • కడపలో తన ఓటమికి 'టైమ్' కారణమన్న షర్మిల
  • తాను కడపలో మొత్తం తిరగలేకపోయానని వ్యాఖ్య
  • కడపలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని ఆరోపణ
  • హంతకుల పాపం పండేరోజు వస్తుందన్న షర్మిల
కడపలో తన ఓటమికి ప్రధాన కారణం 'టైమ్' అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం ఆమె పత్రికా సమావేశంలో మాట్లాడుతూ... తాను కడపలో కేవలం 14 రోజులు మాత్రమే తిరిగానన్నారు. మిగతా అన్ని రోజులూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించానని వెల్లడించారు. 14 రోజుల పాటు ఎంతో కష్టపడినా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను కవర్ చేయలేకపోయామన్నారు. అసలు తాను పోటీ చేస్తున్న విషయం చాలా గ్రామాల్లో తెలియదన్నారు.

కడపలో పరిస్థితులు అంతా వేరుగా ఉన్నాయన్నారు. కడపలో అప్పటికే వైసీపీ నుంచి ఎంపీ ఉన్నారని... ఎమ్మెల్యేలు ఉన్నారని... అప్పుడు వైసీపీయే అధికారంలో ఉందని గుర్తు చేశారు. దీంతో అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలిస్తే తమకు వచ్చే పథకాలు పోతాయని... కేసులు పెడతారని... దాడులు చేస్తారనే భయం ప్రజల్లో ఉందన్నారు. అదే సమయంలో ఓటుకు రూ.3,500 నుంచి ఆ పైన ఇచ్చారన్నారు. విచ్చలవిడిగా డబ్బులు పంచారన్నారు. డబ్బులు పని చేయని చోట బెదిరింపులకు పాల్పడ్డారన్నారు.

హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే...

హంతకులు మరోసారి చట్టసభలకు వెళ్లకూడదనే ఉద్దేశంతో మాత్రమే తాను పోటీ చేశానని షర్మిల తెలిపారు. తన లక్ష్యం నెరవేరకపోవచ్చు కానీ... ప్రజల కంటే పైన దేవుడు ఉన్నాడని... వారి పాపం పండుతుందన్నారు. వారి పాపం పండే రోజు కోసం దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడని తాను భావిస్తున్నానన్నారు.


More Telugu News