హిట్ అండ్ రన్ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు కుమార్తె మాధురి అరెస్ట్

  • సోమవారం రాత్రి చెన్నై బీసెంట్‌నగర్‌లో ఘటన
  • స్నేహితురాలితో బీఎండబ్ల్యూలో వెళ్తుండగా అదుపు తప్పి పేవ్‌మెంట్ పైకి
  • తీవ్ర గాయాలతో 24 ఏళ్ల పెయింటర్ సూర్య మృతి
  • మాధురిని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిలు ఇచ్చి పంపిన పోలీసులు
హిట్ అండ్ రన్ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు కుమార్తె మాధురిని సోమవారం రాత్రి చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె డ్రైవ్ చేస్తున్న కారు పేవ్‌మెంట్‌పై నిద్రపోతున్న వ్యక్తిపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అరెస్ట్ తర్వాత మాధురి స్టేషన్ బెయిలుపై బయటకు వచ్చారు.

సోమవారం రాత్రి మాధురి తన స్నేహితురాలితో కలిసి చెన్నై బీసెంట్ నగర్‌లో తన బీఎండబ్ల్యూ కారులో వెళ్తుండగా కారు అదుపు తప్పి  పేవ్‌మెంట్‌పై నిద్రపోతున్న 24 ఏళ్ల పెయింటర్ సూర్యపై నుంచి దూసుకెళ్లింది.

ఘటన జరిగిన వెంటనే మాధురి అక్కడి నుంచి పరారయ్యారు. ఆమె స్నేహితురాలు మాత్రం అక్కడ గుమికూడిన వారితో వాదులాటకు దిగారు. ఆ తర్వాత ఆమె కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ లోపు కొందరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సూర్యను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.

సూర్యకు 8 నెలల క్రితమే వివాహమైంది. విషయం తెలిసిన ఆయన బంధువులు జే-5 శాస్త్రినగర్‌ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు సీసీటీవీ చెక్ చేయగా, ప్రమాదానికి కారణమైన కారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీఎంఆర్ (బీద మస్తాన్‌రావు) గ్రూపు పేరిట పుదుచ్చేరిలో రిజిస్టర్ అయినట్టు గుర్తించారు. 

కారుని మాధురి డ్రైవ్ చేసినట్టు గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు.  ఆ వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. బీద మస్తాన్‌రావు 2022లో రాజ్యసభ సభ్యుడయ్యారు. బీఎంఆర్ గ్రూప్ అనేది సముద్ర ఆహార ఉత్పత్తుల్లో చిరపరిచితమైన పేరు.


More Telugu News