పావో నుర్మి గేమ్స్‌లో నీర‌జ్ చోప్రాకు స్వ‌ర్ణ ప‌త‌కం

  • ఫిన్‌లాండ్ వేదిక‌గా పావో నుర్మి గేమ్స్‌ 
  • జావెలిన్‌ను ఏకంగా 85.97 మీట‌ర్లు విసిరి స‌త్తా చాటిన నీర‌జ్ చోప్రా
  • మూడో ప్ర‌య‌త్నంలో 85.97 మీటర్ల త్రోతో నీర‌జ్‌కు గోల్డ్ మెడ‌ల్
  • ఫిన్‌లాండ్‌కు చెందిన కెరానెన్, హెలాండ‌ర్‌ల‌కు రజతం, కాంస్యం
టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడ‌ల్ విజేత, భార‌త స్టార్ జావెలిన్ త్రోయ‌ర్‌ నీర‌జ్ చోప్రా పావో నుర్మి గేమ్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలుచుకున్నాడు. ఫిన్‌లాండ్‌లో జ‌రిగిన టోర్నీలో జావెలిన్‌ను ఏకంగా 85.97 మీట‌ర్లు విసిరి స‌త్తా చాటారు. ఎనిమిది మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ఈవెంట్‌లో త‌న మూడో ప్ర‌య‌త్నంలో నీర‌జ్ 85.97 మీటర్ల త్రోతో గోల్డ్ మెడ‌ల్ ద‌క్కించుకున్నారు.

ఇక నీర‌జ్‌కు ఈ సీజ‌న్‌లో ఇది మూడో ఈవెంట్‌. గాయం బారిన ప‌డ‌కూడ‌ద‌నే ముందు జాగ్రత్త కారణంగా గత నెలలో చెకియాలో జరిగిన ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్‌కు అత‌డు దూరమయ్యాడు. కాగా, పారిస్ ఒలింపిక్స్ ముందు నీర‌జ్ ప్ర‌ద‌ర్శ‌న మ‌రోసారి ప‌త‌కంపై భార‌త్ ఆశ‌ల‌ను పెంచేసింది. 

కాగా, నీరజ్ 83.62 మీటర్ల త్రోతో ఈవెంట్‌ను ప్రారంభించాడు. మొద‌టి రౌండ్ ముగిసేస‌రికి అత‌నే ముందంజ‌లో ఉన్నాడు. కానీ, రెండో రౌండ్‌లో ఫిన్‌లాండ్‌కు చెందిన ఆలివర్ హెలాండర్ త‌న ఈటెను 83.96 మీటర్లకు విసిరి మ‌నోడిని రెండో స్థానానికి నెట్టాడు. అయితే మూడో ప్రయత్నంలో భారత్‌ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. చోప్రా తన జావెలిన్‌ను ఏకంగా 85.97 మీటర్లకు విసిరాడు. మ‌రో ఫిన్‌లాండ్ అథ్లెట్ టోనీ కెరానెన్ 84.19 మీటర్ల త్రోతో చోప్రాకు దగ్గరగా వచ్చాడు. 

ఇక జర్మనీకి చెందిన యువ సంచ‌ల‌నం 19 ఏళ్ల మాక్స్ డెహ్నింగ్ ఈ ఈవెంట్‌లో నీరజ్ చోప్రాకు గ‌ట్టిపోటీ ఇస్తాడ‌ని అంద‌రూ భావించారు. కానీ, డెహ్నింగ్ తన మూడు లీగల్ త్రోలలో మొదటి ప్రయత్నంలో విసిరిన‌ 79.84 మీటర్లు మాత్రమే తన అత్యుత్తమ త్రోగా నిలిచింది. ఆ త‌ర్వాత ఆ మార్క్‌ను అత‌డు దాట‌లేక‌పోయాడు. మొత్తంగా ఈ ఈవెంట్‌లో అతను ఏడో స్థానంతో స‌రిపెట్టుకున్నాడు. 

నీర‌జ్‌ చోప్రా తర్వాత ఫిన్‌లాండ్‌కు చెందిన కెరానెన్, హెలాండర్ వరుసగా 84.19 మీటర్లు, 83.96 మీటర్ల త్రోలతో రజతం, కాంస్యాన్ని గెలుచుకున్నారు. ఇదిలాఉంటే.. నీర‌జ్ చోప్రా ఇప్పుడు జులై 7న పారిస్ డైమండ్ లీగ్‌లో ఆడే అవ‌కాశం ఉంది. ఒకవేళ ఈ లీగ్ నుంచి త‌ప్పుకుంటే మాత్ర‌మే అతను నేరుగా జులై 26న ప్రారంభమయ్యే పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటాడు.


More Telugu News