గంభీర్ డిమాండ్లకు బీసీసీఐ అంగీకారం.. ప్రధాన డిమాండ్ ఇదే?

  • పరిమితి ఓవర్ల ఫార్మాట్, టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లకు ప్రత్యేక జట్లు ఉండాలన్న గంభీర్   
  • జట్టుపై పూర్తి కమాండ్ ఇవ్వాలని డిమాండ్
  • బీసీసీఐ అంగీకరించిందని పేర్కొంటున్న కథనాలు
టీమిండియా తదుపరి కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారు అయినట్టేనని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం 2-4 గంటల సమయంలో గంభీర్‌ని ఇంటర్వ్యూకి పిలిచారని, బీసీసీఐ కార్యాలయంలో సెక్రటరీ జైషా, ఇతర అధికారుల సమక్షంలో జరిగే ఈ ఇంటర్వ్యూలో గంభీర్‌ను అధికారికంగా ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.

కాగా ప్రధాన కోచ్‌గా గంభీర్ ఎంపిక దాదాపు ఇప్పటికే పూర్తయిందని బీసీసీఐ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. గంభీర్ ప్రతిపాదిత నిబంధనలకు బీసీసీఐ అంగీకరించినందున తదుపరి ప్రధాన కోచ్‌ అతడేనని పేర్కొన్నాయి. జట్టుపై పూర్తి నియంత్రణతో పాటు ప్రధానంగా పరిమితి ఓవర్ల ఫార్మాట్, టెస్ట్ ఫార్మాట్‌‌కు వేర్వేరు జట్లు ఉండాలంటూ బీసీసీఐ ముందు గంభీర్ ప్రతిపాదించాడని తెలుస్తోంది. గంభీర్ డిమాండ్లను బీసీసీఐ ఇదివరకే అంగీకరించిందని, అతడిని కోచ్‌గా నియమించేందుకు బీసీసీఐ ఆసక్తిగా ఉందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.

కాగా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు మే 27తో గడువు ముగిసిపోయింది. కొత్త కోచ్‌గా ఎంపికైన వారు జులై 2024 నుంచి డిసెంబర్ 2027 వరకు మూడు ఫార్మాట్ల జట్లకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం 2023 వన్డే వరల్డ్ కప్‌తో ముగిసిపోయింది. మరింత కాలం కోచ్‌గా పనిచేయడం ఇష్టం లేదని ద్రావిడ్ తేల్చిచెప్పాడు. దీంతో బీసీసీఐ కొత్త కోచ్ అన్వేషణ మొదలు పెట్టిన విషయం తెలిసిందే.


More Telugu News