గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు: కోదండరాం విమర్శలు

  • జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఎదుట హాజరైన కోదండరాం
  • ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం అధికారాలను ఉపయోగించాలని సూచన
  • అభివృద్ధి అంటే ఒకరిద్దరికి లాభం చేయడం కాదని వ్యాఖ్య
గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లు, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతోంది. ఇందుకోసం హైదరాబాద్ లోని బీఆర్కే భవన్‌లోని కమిషన్ కార్యాలయానికి కోదండరాంతో పాటు విద్యుత్ శాఖ అధికారి రఘు వచ్చారు. వారిద్దరి నుంచి కమిషన్ వివరాలు అడిగి తెలుసుకుంది.

అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ... ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించాలన్నారు. అభివృద్ధి అంటే ఒకరిద్దరికి లాభం చేయడం కాదన్నారు. గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల ట్రాన్స్‌కో, జెన్‌కోలకు రూ.81 వేల కోట్ల అప్పులు అయ్యాయన్నారు. గత ఏడాది వరదలు వస్తే భద్రాద్రి ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చిందన్నారు.

భవిష్యత్తులో గోదావరి వద్ద నీటి మట్టం పెరిగితే భద్రాద్రి ప్లాంటును కాపాడుకోగలమా? అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఆ తప్పిదాలపై క్రిమినల్ చర్యలకు వెనుకాడవద్దని సూచించారు. అందరూ కూడా చట్టం ప్రకారమే నడుచుకోవాలన్నారు.


More Telugu News