ఈవీఎంలపై జగన్ ట్వీట్.. వీడియోతో టీడీపీ కౌంటర్!

  • ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్ వాడాలన్న జగన్
  • గత ఎన్నికల సమయంలో జగన్ మాట్లాడిన వీడియోను షేర్ చేసిన టీడీపీ
  • 151 సీట్లు వస్తే ఈవీఎంలు భేషుగ్గా ఉన్నట్టు.. లేదంటే లేనట్టా? అని ప్రశ్న
ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్ వాడాలని, ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే న్యాయం జరగడం మాత్రమే కాదని, అది కనిపించాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి చేసిన ట్వీట్‌పై తెలుగుదేశం పార్టీ స్పందించింది. దారుణ ఓటమిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని గతంలోనే పలుమార్లు ఎద్దేవా చేసిన టీడీపీ.. గత ఎన్నికల సమయంలో జగన్ మీడియాతో మాట్లాడిన వీడియోను షేర్ చేసింది.

జగన్‌కు 151 సీట్లు వచ్చినప్పుడు అద్భుతంగా పనిచేసిన ఈవీఎంలు 11 సీట్లు వచ్చినప్పుడు మాత్రం ట్యాంపరింగ్ అయ్యాయా? అని ప్రశ్నించింది. ఇలా ఈవీఎంపై సాకు నెట్టేయడం ఏమంత బాగోలేదని పేర్కొంది. 

టీడీపీ షేర్ చేసిన ఆ వీడియోలో జగన్ మాట్లాడుతూ.. ఈవీఎంలు సక్రమంగానే పనిచేశాయని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎవరికి ఓటు వేసిందీ వీవీప్యాట్‌లో కనిపిస్తుందని, తాను ఒక పార్టీకి ఓటేస్తే, అది మరొక దానికి పడితే ప్రజలు పోలింగ్ బూత్‌లోనే తిరగబడతారని అందులో పేర్కొన్నారు. తాము వేసిన ఓటు వేరే పార్టీకి వెళ్లినట్టు ఎవరికీ కనిపించలేదు కాబట్టే జనం ఎవరూ, ఎక్కడా ఫిర్యాదు చేయలేదని, ఈవీఎంలపై ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. 

పోలింగ్ మొదలు కావడానికి ముందు అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్లు మాక్ పోలింగ్ నిర్వహిస్తారని, 50 ఓట్లు వేసి చెక్ చేసిన తర్వాత ఈవీఎంలు బాగానే పనిచేస్తున్నాయని సంతకాలు పెట్టిన తర్వాతే పోలింగ్ జరుగుతుందని వివరించారు. అలాంటప్పుడు ఈవీఎంలలో లోపాలున్నాయని, అక్రమాలు జరిగాయని ఎలా చెబుతారని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే అన్నీ బాగున్నట్టేనని, లేదంటే మాత్రం ఇలా ప్రజా తీర్పును అవహేళన చేస్తూ నెపాన్ని ఈవీఎంలపై నెట్టేస్తున్నారని మండిపడ్డారు.


More Telugu News