పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు

  • పోలవరం పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
  • స్వాగతం పలికిన మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు
  • 22, 23వ నెంబరు గేట్ల నుంచి ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు
  • ముఖ్యమంత్రికి వివరాలు తెలిపిన అధికారులు 
  • పర్యటన అనంతరం అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. నేడు సోమవారం కాగా, పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబుకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు స్వాగతం పలికారు. 

ప్రత్యేక బస్సులో పోలవరం ప్రాజెక్టులోని అనేక ప్రాంతాలకు వెళ్లి, వివిధ విభాగాలను పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ను వీక్షించారు. చంద్రబాబు 22, 23వ నెంబరు గేట్ల నుంచి ప్రాజెక్టును పరిశీలించారు. పోలవరం పనుల గురించి అధికారులు చంద్రబాబుకు వివరించారు.

ప్రాజెక్టు ఎడమ గట్టు వద్ద కుంగిపోయిన గైడ్ బండ్ ప్రాంతాన్ని, గ్యాప్-3 ప్రాంతం, ఎగువ కాఫర్ డ్యామ్ ప్రాంతాలను కూడా చంద్రబాబు పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, కొందరు ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. 

చంద్రబాబు పోలవరం పర్యటనలో భాగంగా... దెబ్బతిన్న డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని కూడా పరిశీలించారు. డయాఫ్రం వాల్ నిర్మాణ పనుల ఫొటోలను తిలకించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్ష ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.


More Telugu News