క్రికెట్ ప్రపంచ కప్‌ల చరిత్రలో అరుదైన రికార్డు నమోదు

  • వరల్డ్ కప్‌ టోర్నీలో తొలిసారి ‘రిటైర్ ఔట్’గా నికోలాస్ డేవిన్ రికార్డు
  • ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడని వెనక్కి పిలిచిన నమీబియా జట్టు మేనేజ్‌మెంట్
  • 41 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచిన ఇంగ్లండ్
టీ20 వరల్డ్ కప్ 2024లో అరుదైన రికార్డు నమోదయింది. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా ఆటగాడు నికోలస్ డేవిన్ ‘రిటైర్ ఔట్’గా వెనుతిరిగాడు. వరల్డ్ కప్‌ టోర్నీలో ఈ విధంగా ఔట్ అయిన తొలి ఆటగాడిగా నికోలస్ నిలిచాడు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లండ్-నమీబియా జట్ల మధ్య శనివారం కీలక మ్యాచ్ జరిగింది. వర్షం వల్ల మ్యాచ్ కు అంతరాయం కలగడంతో.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం నమీబియా విజయ లక్ష్యాన్ని 10 ఓవర్లకు 120 పరుగులుగా అంపైర్లు నిర్దేశించారు.

లక్ష్య ఛేదనలో మైఖేల్ వాన్ లింగేన్‌తో కలిసి నికోలస్ డేవిన్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే నెమ్మదిగా ఆడిన నికోలస్ 16 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పరుగుల వేగం పెంచాలనుకున్న నమీబియా మేనేజ్‌మెంట్ నికోలస్ డేవిన్‌ను వెనక్కి పిలవాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని అతడికి చెప్పగా ‘రిటైర్ ఔట్’ పెవీలియన్‌ చేరాడు. దీంతో వరల్డ్ కప్‌ టోర్నీలో రిటైర్ ఔట్‌గా వెనుతిరిగిన మొట్టమొదటి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ వైస్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 27 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. అయినప్పటికీ ‘రిటైర్ ఔట్’ నిర్ణయాన్ని నమీబియా జట్టు మేనేజ్‌మెంట్ సమర్థించుకుంది. వేగంగా పరుగులు రాబట్టి విజయం సాధించాలనుకున్న నమీబియా బ్యాటర్లను పేసర్లు రీస్ టాప్లీ, సామ్ కర్రాన్, జోఫ్రా ఆర్చర్ నిలువరించడంతో ఇంగ్లండ్ 41 పరుగుల తేడాతో గెలిచింది.

‘రిటైర్ ఔట్’ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఎంసీసీ (మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్) రూల్స్‌లోని ఆర్టికల్ 25.4.2 ప్రకారం.. అనారోగ్యం, గాయం లేదా మరేదైనా ఇతర అనివార్య కారణాలతో బ్యాట్స్‌మెన్ ‘రిటైర్ ఔట్’గా వెనుతిరిగితే తిరిగి బ్యాటింగ్ చేయడానికి అర్హత ఉంటుంది. నిబంధనలో పేర్కొన్న కారణాలు కాకుండా ఇతర కారణాలతో ‘రిటైర్ ఔట్’ అయితే మాత్రం ప్రత్యర్థి జట్టు అనుమతిస్తే మాత్రమే అతడు తిరిగి బ్యాటింగ్ చేయొచ్చు.


More Telugu News