ఏకంగా 6100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌!

  • ‘వన్‌ప్లస్ ఏస్ 3 ప్రో’ పేరిట మార్కెట్‌లో రానుందని సమాచారం
  • కంపెనీ నుంచి తొలిసారి 6000 ఎంఏహెచ్‌కు పైగా సామర్థ్యంతో ఫోన్
  • ఆకట్టుకుంటున్న ఫోన్ ఫీచర్లు
చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం ‘వన్‌ప్లస్’ త్వరలోనే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఏకంగా శక్తిమంతమైన 6,100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ రానుందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు సామ్‌సంగ్, ఇన్ఫినిక్స్, మోటరోలా, వివో బ్రాండ్లు మాత్రమే 6,000 ఎంఏహెచ్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీల ఫోన్లను మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. ఈ జాబితాలో వన్‌ప్లస్ కూడా చేరబోతోంది.

వన్‌ప్లస్ నుంచి రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు ‘వన్‌ప్లస్ ఏస్ 3 ప్రో’ అని పేరు పెట్టే అవకాశాలున్నాయని టెక్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ కంపెనీ నుంచి గతేడాది మార్కెట్‌లోకి వచ్చిన ‘వన్‌ప్లస్ ఏ 2 ప్రో’ తో పోలిస్తే బ్యాటరీ సామర్థ్యం 10 శాతం అధికమని, 600 ఎంఏహెచ్ కెపాసిటీ ఎక్కువగా లభించనుందని చైనీస్ టిప్‌స్టర్ ప్లాట్‌ఫామ్ ‘వైబో‘ వెల్లడించింది. ఈ ఫోన్ 6,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 100వాట్స్ సూపర్‌వోక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ ఈ ఫోన్ ప్రత్యేకతలని వివరించింది. ఫోన్‌లో రెండు 2,970 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌లు అమర్చి ఉంటాయని, రెండు కలిపి మొత్తం 6,100 ఎంఏహెచ్ సామర్థ్యాన్ని అందిస్తాయని పేర్కొంది.

ధర ఎంతంటే?
ఇక వన్‌ప్లస్ ఏస్ 3 ప్రో ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌‌పై పనిచేయనుందని కథనాలు పేర్కొంటున్నాయి. 120హెచ్‌జెడ్ ఎల్‌టీపీవో రిఫ్రెష్ రేట్, 6.78-అంగుళాల 1.5కే రిజల్యూషన్ డిస్‌ప్లే,  12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్ననల్ స్టోరేజీ, 50ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో సెన్సార్‌, వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16ఎంపీ కెమెరా ప్రత్యేకంగా జోడించారు. ఇక ఫోన్ ధర రూ.39,000 వరకు ఉండవచ్చునని అంచనాగా ఉంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కంపెనీ ఎలాంటి వివరాలను అధికారికంగా ధృవీకరించలేదు. దీంతో యూజర్లు స్మార్ట్‌ఫోన్ వివరాల గురించి తెగ ఆరా తీస్తున్నారు.


More Telugu News