ఏయూలో అక్రమాలపై వాట్సాప్‌ ద్వారా విద్యార్థిని ఫిర్యాదు.. వెంటనే స్పందించిన లోకేశ్

  • వీసీ, రిజిస్ట్రార్ అక్రమాలకు పాల్పడుతున్నారని న్యాయ విద్యార్థిని ఫిర్యాదు
  • వెంటనే ఫోన్ చేసిన మంత్రి లోకేశ్ పీఏ
  • విద్యపై సమీక్షలో విద్యార్థిని ఫిర్యాదును ప్రస్తావించిన లోకేశ్
  • ఆమెకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్న అధికారులు
రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, వర్సిటీలోని కీలక అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజన ప్రియ వాట్సాప్ ద్వారా చేసిన ఫిర్యాదుపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. విద్యపై నిన్న ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో మంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించడంతో అధికారులు వెంటనే ఆమెకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

అంజన ప్రియ ఫిర్యాదు ఇలా..
రాజకీయ ప్రయోజనాల కోసం వర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, ఇతర కీలక అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రశ్నించినందుకు తనను ఏయూ మహిళా హాస్టల్ చీఫ్ వార్డెన్ బెదిరించారని ఆరోపించారు. దీనిపై తాను షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. అడ్డదారిలో రిజిస్ట్రార్‌గా వచ్చిన జేమ్స్ స్టీఫెన్ ఆ పదవికి అర్హులు కాదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వర్సిటీ వనరులు, నిధులను వీసీ దోచుకున్నారని ఆరోపించారు. వర్సిటీలో రాజకీయ నాయకుల విగ్రహాలు, పుట్టిన రోజు వేడుకలు, జెండాలు, కార్లతో ర్యాలీలు నిర్వహించి కలకలం సృష్టించారని వివరించారు.

ఏయూలో ఓ ప్రొఫెసర్ 1400 పీహెచ్‌డీలు అమ్ముకున్నారని ఆరోపించారు. ఫైళ్లు మాయం కాకముందే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. తన ఫిర్యాదుపై మంత్రి లోకేశ్ స్పందించడంతో ఆయన పీఏ తనతో మాట్లాడినట్టు అంజన ప్రియ తెలిపారు. సమీక్షలో మంత్రి తన ఫిర్యాదును ప్రస్తావించిన తర్వాత ఉన్నతాధికారులు తనకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకునట్టు చెప్పారు. తన ఫిర్యాదుకు గంటల వ్యవధిలోనే స్పందన వస్తుందని తాను ఊహించలేదని అంజన ప్రియ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


More Telugu News