మణిపూర్ ముఖ్యమంత్రి నివాసం ఎదురింట్లో భారీ అగ్నిప్రమాదం!

  • ఇంఫాల్ నగరంలోని సీఎం అధికారిక నివాసం ఎదుట ప్రమాదం
  • శనివారం సాయంత్రం ఇంట్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
  • ప్రమాదం జరిగిన ఇల్లు గోవా మాజీ చీఫ్ సెక్రటరీదని తెలిపిన అధికారులు, ఏడాదిగా ఖాళీగా ఉన్న వైనం
  • గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేసిన పోలీసులు
ఇంఫాల్‌ నగరంలోని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ అధికారిక నివాసం ఎదురుగా ఉన్న ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించడం కలకలానికి దారి తీసింది. శనివారం సాయంత్రం 5.30 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ఆ ఇల్లు గోవా మాజీ చీఫ్ సెక్రటరీ థాంగ్‌కోఫావ్ కిప్‌జెన్‌ది అని పోలీసులు తెలిపారు. కిప్‌జెన్ 2005లో మరణించగా కొంత కాలం పాటు ఆయన కుటుంబసభ్యులు ఆ ఇంట్లో నివసించారన్నారు. అయితే, ఏడాదిగా ఇల్లు ఖాళీగానే ఉందని చెప్పారు. ఇంటిపైకప్పు చెక్కతో చేయడంతో మంటలను ఆర్పేందుకు శ్రమపడాల్సి వచ్చిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఈ అగ్ని ప్రమాదానికి కారణమేంటో మాత్రం ఇంకా తెలియరాలేదు.


More Telugu News