విధ్వంసక పాలనకు గుర్తుగా ప్రజావేదిక అలాగే ఉంటుంది... శిథిలాలు తొలగించం: సీఎం చంద్రబాబు

  • సీఎం అయ్యాక తొలిసారిగా టీడీఫీ ఆఫీసుకు వచ్చిన చంద్రబాబు
  • త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని వెల్లడి
  • ప్రజల నుంచి వినతుల స్వీకరణకు వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటన
ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా టీడీపీ ఆఫీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విధ్వంసక పాలనకు గుర్తుగా ప్రజావేదిక నిలిచిపోతుందని, దాన్ని ఇలాగే ఉంచుతామని, శిథిలాలు తొలగించబోమని అన్నారు. 

ఇక, అసెంబ్లీ సమావేశాల తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. పోలవరం సందర్శనతోనే తన క్షేత్రస్థాయి పర్యటనలు మొదలవుతాయని చంద్రబాబు తెలిపారు. ఇక, ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమం సచివాలయంలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నామని వెల్లడించారు. సచివాలయానికి రాకపోకల నిమిత్తం రవాణా సదుపాయాలు కల్పిస్తామని, ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 

ఇక పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం పట్ల చంద్రబాబు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు, ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండడానికి వీల్లేదని అన్నారు. ప్రజల నుంచి సమస్యలపై విజ్ఞప్తుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాదు, సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట కాల పరిమితి ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.


More Telugu News