జగన్ నివాసంలో ప్రభుత్వ ఫర్నిచర్... కోడెల శివరామ్ స్పందన

  • నాడు కోడెల శివప్రసాద్ పై ఇలాగే కేసు పెట్టారన్న శివరామ్
  • నాడు కోడెల చెప్పేవరకు ఫర్నిచర్ ఉందన్న సంగతి ఎవరికీ తెలియదని వెల్లడి
  • సీఎంవో ఖాతాలో తెచ్చిన ఫర్నిచర్ ను జగన్ తన నివాసంలో ఉంచారని ఆరోపణ
తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద డబుల్ లేన్ రహదారి, ప్రభుత్వ ఫర్నిచర్ వినియోగం తదితర అంశాలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రోడ్డును ప్రైవేటు రోడ్డుగా మార్చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, అప్పటి సీఎం క్యాంపు ఆఫీసు నుంచే జగన్ ఇంకా రాజకీయ భేటీలు కొనసాగిస్తున్నారని, ప్రభుత్వ ఫర్నిచర్ నే ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

దీనిపై దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్ స్పందించారు. ఆనాడు కోడెలపై అన్యాయంగా కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు ప్రభుత్వ ఫర్నిచర్ తన వద్ద ఉందని కోడెల చెప్పకపోతే ఎవరికీ తెలిసేది కాదని, ఫర్నిచర్ తీసుకెళ్లాలని స్పీకర్ కు లేఖ రాశాక కోడెలపై కేసు పెట్టారని శివరామ్ వెల్లడించారు. అప్పటి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారని తెలిపారు. 

జగన్ కూడా తాడేపల్లి, లోటస్ పాండ్ ఇళ్లకు రూ.18 కోట్లు ఖర్చు చేశారని, సీఎంవో ఖాతాలో తీసుకువచ్చిన ఫర్నిచర్ ను తన నివాసంలో అమర్చుకున్న జగన్.. ఆ ఫర్నిచర్ ను తిరిగి అప్పగిస్తానని లేఖ రాయలేదని కోడెల శివరామ్ పేర్కొన్నారు. ఫర్నిచర్ ఇవ్వనందుకు కోడెలపై కేసు పెట్టినట్టే, జగన్ మీద కూడా కేసు పెట్టొచ్చు కదా అని అన్నారు.

జగన్ పై వినిపిస్తున్న ఇతర ఆరోపణలు ఇవే...

  • క్యాంప్ ఆఫీసు పరిధిలోని 1.5 కిలోమీటర్ల రోడ్డుకు రూ.5 కోట్ల వ్యయం
  • ప్రకాశం బ్యారేజ్ నుంచి రేవేంద్రపాడు రహదారికి మంజూరైన నిధులతో క్యాంపు ఆఫీసు రోడ్డు నిర్మాణం
  • సీఎంగా ఉన్నప్పుడు క్యాంపు ఆఫీసు కోసం కోట్ల రూపాయల ఖర్చుతో పునరుద్ధరణ పనులు
  • ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చుపెట్టి కొనుగోలు చేసిన ఫర్నిచర్ నే ఇంకా వినియోగిస్తున్న జగన్
  • ఇంటి చుట్టూ ప్రహరీ గోడపై ఇనుప కంచె కోసమే కోట్లాది రూపాయల ఖర్చు
  • సోలార్ ఫెన్సింగ్, ట్రాన్స్ ఫార్మర్లు, యూపీఎస్ వ్యవస్థల ఏర్పాటు కోసం రూ.3.63 కోట్ల ఖర్చు!





More Telugu News