ఏపీలో మందగించిన నైరుతి రుతుపవనాల గమనం

  • అనుకూలంగా లేని పరిస్థితులు
  • ఉత్తరాంధ్రకు ఇంకా విస్తరించని వైనం
  • మరో రెండు మూడు  రోజుల సమయం పట్టొచ్చంటున్న వాతావరణ నిపుణులు
ఆంధ్రప్రదేశ్ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. ఫలితంగా కొన్ని ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు ఇంకా తాకలేదు. నిజానికి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అంచనా కంటే 3 రోజులు ముందుగానే ఏపీలోకి ప్రవేశించాయి. ఈ నెల 2న రాష్ట్రాన్ని తాకినప్పటికీ ఆ తర్వాత వేగంగా విస్తరించడంలో మందగించాయి.

ఉత్తరాంధ్రను నైరుతి మేఘాలు ఇంకా పలకరించలేదు. ఈ నెల 8న గోదావరి జిల్లాలను దాటిన నైరుతి మేఘాలు శుక్రవారం నాటికి కూడా ఉత్తరాంధ్రకు విస్తరించలేదు. మరో రెండు మూడు రోజుల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంపూర్ణంగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించనందున రాష్ట్రంలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో మినహాయించి వర్షాలు అంత పెద్ద ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. కాగా మూడు రోజుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

రానున్న మూడు రోజుల్లో వర్షాలు..
అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అప్రమత్తం చేసింది. మరోవైపు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శనివారం అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కాగా శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ జాబితాలో పార్వతీపురం మన్యం, కర్నూలు, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, నంద్యాల జిల్లాలు ఉన్నాయి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా రాజాంలో అత్యధికంగా 78.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


More Telugu News