మంచి చేసి ఓడిపోయాం: మాజీ మంత్రి రోజా

  • సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన ఫలితాలు
  • అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితం
  • లోక్ సభ ఎన్నికల్లో కేవలం 4 స్థానాలు
  • చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలన్న రోజా
  • మంచి చేశాం కాబట్టి ధైర్యంగా తలెత్తుకుని తిరుగుదామని పిలుపు
వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే ఓటమి తాలూకు దిగ్భ్రాంతి నుంచి బయటికి వస్తున్నారు. కానీ, జగన్ సహా వైసీపీ నేతలందరిదీ ఒకటే మాట.... ప్రజలకు మేం చేసిన మంచి ఏమైపోయింది? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తాజాగా, మాజీ మంత్రి రోజా కూడా స్పందించారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలని, కానీ తాము మంచి చేసి ఓడిపోయామని తెలిపారు. అందుకే గౌరవంగా తలెత్తుకు తిరుగుదామని, ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అని సహచర వైసీపీ నేతలకు ఆమె పిలుపునిచ్చారు. 

సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ముందు రోజు వరకు ఎంతో ధీమాగా ఉన్న వైసీపీ... ఓట్ల లెక్కింపు మొదలైన గంటలోనే ఫలితాల సరళితో షాక్ కు గురైంది. ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 కాగా... వైసీపీకి ఈసారి 11 స్థానాలే లభించాయి. 

గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచిన తమకు, ఈసారి అంతకంటే ఎక్కువ సీట్లే వస్తాయని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ నేతలు... ఫలితాలు అందుకు పూర్తి భిన్నంగా రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏకంగా 164 స్థానాలు కైవసం చేసుకుని వైసీపీని తిరుగులేని దెబ్బకొట్టింది. 

లోక్ సభ ఎన్నికల్లోనూ టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2 స్థానాలు గెలుచుకోగా, వైసీపీ 4 స్థానాలతో సరిపెట్టుకుంది. ఆ పార్టీకి గత ఎన్నికల్లో 22 లోక్ స్థానాలు వచ్చాయి. 

ఇక, గత ప్రభుత్వంలో టూరిజం మంత్రిగా వ్యవహరించిన రోజా నగరి నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ చేతిలో రోజా 45,004 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.


More Telugu News