ఇటలీలో రిషి సునాక్, మేక్రాన్, జెలెన్ స్కీలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ

  • ఇటలీలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
  • జీ7 సదస్సుకు హాజరు
  • ప్రపంచ నేతలతో వరుస భేటీలు
ఇటలీలో జీ7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతలతో వరుసగా సమావేశమయ్యారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశాలకు సంబంధించిన వివరాలను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

"మా స్నేహితుడు మేక్రాన్ తో సమావేశం అద్భుతంగా జరిగింది. ఈ ఏడాదిలో ఇది మాకు నాలుగో భేటీ. భారత్-ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి మేం ఇచ్చే ప్రాధాన్యతకు ఇది నిదర్శనం. రక్షణ రంగం, భద్రత, టెక్నాలజీ, ఏఐ (కృత్రిమ మేధ), సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ, తదితర రంగాలపై ఇరువురం చర్చించుకున్నాం. వచ్చే నెలలో పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మేక్రాన్ కు శుభాకాంక్షలు తెలియజేశాను" అని వివరించారు. 

ఇక, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో సమావేశం ఆహ్లాదకరంగా సాగిందని మోదీ  వెల్లడించారు. "ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, బ్రిటన్ తో సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి మా చిత్తశుద్ధిని సునాక్ ఎదుట పునరుద్ఘాటించాను. సెమీకండక్టర్లు, టెక్నాలజీ, వాణిజ్యం తదితర రంగాల్లో పటిష్ఠ సంబంధాలకు గొప్ప అవకాశాలు ఉన్నాయి. రక్షణ సంబంధాలను కూడా మరింత దృఢతరం చేసుకునేందుకు నేను, రిషి సునాక్ చర్చించుకున్నాం" అని మోదీ వెల్లడించారు. 

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో మోదీ సమావేశానికి ఇరు దేశాల అధికారులు కూడా హాజరయ్యారు. జెలెన్ స్కీని ఆలింగనం చేసుకున్న మోదీ ఆత్మీయంగా వీపు తట్టారు. అనంతరం ఇరువురు అనేక అంశాలపై చర్చించుకున్నారు. జెలెన్ స్కీతో చర్చలు ఎంతో ఫలప్రదంగా సాగాయని మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై భారత్ ఆసక్తిగా ఉందన్న విషయాన్ని జెలెన్ స్కీకి తెలియజేశానని వెల్లడించారు. 

ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో, మానవీయ విలువల ఆధారిత దృక్పథాన్ని విశ్వసిస్తుందని, శాంతి స్థాపనకు చర్చలు, దౌత్య విధానాలే మార్గమని నమ్ముతున్నామని జెలెన్ స్కీకి తెలియజేసినట్టు మోదీ వెల్లడించారు.


More Telugu News