కువైట్‌ అగ్నిప్రమాదం.. కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు

  • కువైట్‌లో ఈ నెల 12న జరిగిన ఘోర అగ్నిప్రమాదం
  • ఈ ప్ర‌మాదంలో మరణించిన 45 మంది భారతీయులు
  • వారి మృతదేహాలను కొచ్చికి తీసుకువ‌చ్చిన‌ ప్రత్యేక ఐఏఎఫ్‌ విమానం
  • మృతుల్లో కేరళకు చెందిన వారే 23 మంది.. ముగ్గురు తెలుగు వారు
గ‌ల్ఫ్ దేశం కువైట్‌లో ఈ నెల 12న‌ (బుధవారం) ఓ నివాస భ‌వ‌నంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలను తీసుకువ‌చ్చిన‌ ప్రత్యేక ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ విమానం ఈరోజు కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలోని లేబర్ హౌసింగ్ ప్రాంతం నుండి ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారి మృతదేహాలను వెంటనే స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ఈ ప్రత్యేక ఐఏఎఫ్‌ విమానాన్ని ఏర్పాటు చేసింది. 

అంతకుముందు కువైట్‌లోని భార‌త‌ ఎంబసీ ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. "కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మ‌ర‌ణించిన‌ 45 మంది భారతీయుల మృతదేహాలతో కూడిన ప్రత్యేక ఐఏఎఫ్‌ విమానం జూన్ 13న‌ సాయంత్రం కొచ్చికి బయలుదేరింది. ఈ విమానం జూన్ 14 ఉదయం కొచ్చికి చేరుకునే అవకాశం ఉంది. ఆ వెంటనే ఢిల్లీకి వెళ్తుంది" అని రాయ‌బార కార్యాల‌యం త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అలాగే మృత‌దేహాల‌ను త్వరగా స్వదేశానికి రప్పించడానికి కువైట్ అధికారులతో సమన్వయం చేసిన విదేశాంగ శాఖ స‌హాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ విమానంలో ఉన్నారని ఎంబ‌సీ పేర్కొంది.

అంతేగాక ఈ విషాద ప్రమాదం తరువాత అధికారిక మరణాల సంఖ్యను కూడా ఎంబ‌సీ వెల్ల‌డించింది.   ప్ర‌మాదం సంభ‌వించిన‌ హౌసింగ్ భ‌వ‌నంలో ఉన్న మొత్తం 176 మంది భారతీయ కార్మికులలో 45 మంది చ‌నిపోయార‌ని, మరో 33 మంది గాయపడ్డారని తెలిపింది. క్ష‌త‌గాత్రులు ప్రస్తుతం కువైట్‌లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్లు వెల్ల‌డించింది.

ఇక మృతుల్లో కేరళకు చెందిన వారు 23 మంది ఉంటే.. తమిళనాడుకు చెందిన వారు ఏడుగురు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు ముగ్గురు, కర్ణాటకకు చెందిన వారు ఇద్ద‌రు ఉన్నార‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో పాటు బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, హర్యానా రాష్ట్రాల‌కు చెందిన‌ ఒక్కొక్కరు చొప్పున ఉన్న‌ట్లు తెలిపింది.

ఇక ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ ఆదేశాల మేరకు కువైట్ వెళ్లిన‌ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అక్క‌డి వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను కలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి భారత ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. 

అలాగే ఈ పర్యటనలో భాగంగా మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కువైట్ మొదటి ఉప ప్రధాని, రక్షణ & అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహాద్ యూసఫ్ సౌద్ అల్-సబాహ్, విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్-యాహ్యాతో సహా సీనియర్ కువైట్ అధికారులతో కూడా భేటీ కావ‌డం జ‌రిగింది. ఈ స‌మావేశంలో కువైట్ విదేశాంగ మంత్రి ఈ విషాదక‌ర విచారం వ్య‌క్తం చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తుకు, పూర్తి సహాయానికి హామీ ఇచ్చారు.

ఇదిలాఉంటే.. మృతదేహాలను వారి ఇళ్లకు సజావుగా తరలించేందుకు ప్ర‌త్యేకంగా అంబులెన్స్‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ఎర్నాకుళం జిల్లా కలెక్టర్ ఎన్‌ఎస్‌కే ఉమేష్ వెల్ల‌డించారు.


More Telugu News