ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. నగదు తరలింపు వెనక ఐపీఎస్ అధికారి!

  • ముగ్గురు కానిస్టేబుళ్ల వాంగ్మూలం
  • 2022 అక్టోబరు 26 నుంచి నవంబర్ 2 వరకు ప్రతిరోజు రాత్రి నగదు తరలించినట్టు వెల్లడి
  • డబ్బు తరలించిన ఫార్చూనర్ వాహనానికి తాను ఎస్కార్ట్‌గా వ్యహరించానన్న కానిస్టేబుల్
  • ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావు గురించి అప్పుడే తెలిసిందని వాంగ్మూలం
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఓ ఐపీఎస్‌ అధికారితోపాటు పాటు ఓ డీఎస్పీ బీఆర్ఎస్‌కు సహకారం అందించినట్టు దర్యాప్తులో వెలుగుచూసింది. అంతేకాదు, తెరవెనుక మరికొందరు అత్యున్నతస్థాయి పోలీసులు ఉన్నట్టు సమాచారం. వారి మౌఖిక ఆదేశాలతో ఐపీఎస్ అధికారి నేతృత్వంలోని బృందం నగదు సరఫరాను పర్యవేక్షించిట్టు తెలిసింది. దర్యాప్తులో మున్ముందు సహకారం అందించిన అత్యున్నతస్థాయి అధికారుల పేర్లు కూడా బయటకు వచ్చినట్టు సమాచారం.

మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి కోసం నిబంధనలకు విరుద్ధంగా డబ్బు సరఫరా చేసేందుకు ఫార్చునర్ వాహనాన్ని వినియోగించారు. ఆ వాహనానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించిన కానిస్టేబుల్ వాంగ్మూలం ఆధారంగా ఈ విషయం వెలుగుచూసింది. ఐపీఎస్ అధికారితోపాటు స్పెషల్ బ్రాంచ్ వ్యవహారాలను పర్యవేక్షించిన డీఎస్పీ ఆదేశాలతోనే తాను ఆ వాహనానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించినట్టు నల్గొండకు చెందిన ఆ కానిస్టేబుల్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అంతేకాదు, అప్పుడేం జరిగిందన్న విషయాన్ని పూర్తిగా వివరించాడు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తాను నల్గొండ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేశానని, ఐపీఎస్ అధికారి ఆదేశాల మేరకు డీఎస్పీ తనను తీసుకెళ్లారని ఆ కానిస్టేబుల్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. నవంబరు 1న తప్ప 2022 అక్టోబరు 26 నుంచి నవంబర్ 2 వరకు ప్రతి రాత్రి ఫార్చునర్ వాహనానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించినట్టు వివరించాడు. ఆ వాహనంలోనే బీఆర్ఎస్ అభ్యర్థి డబ్బును తరలించారని తెలిపాడు.

అక్టోబర్ 31న జరిగిన బహిరంగ సభలో అప్పటి ముఖ్యమంత్రి పాల్గొన్నారని, ఆ సభలోనే తమ డీఎస్పీ ఓ ఐపీఎస్ అధికారిని చూపించి, కేసీఆర్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారని, ఆయన ఆదేశాల మేరకు డబ్బును సరఫరా చేస్తున్నట్టు వివరించారని పేర్కొన్నారు. ఆ తర్వాతే ఆ అధికారి నాయిని భుజంగరావు (ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు) అని తనకు తెలిసిందని ఆ కానిస్టేబుల్ తన వాంగ్మూలంలో పూసగుచ్చినట్టు వివరించాడు.


More Telugu News