ఏపీ సీఎం నిన్న అమరావతిని రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషం కలిగించింది: వెంకయ్యనాయుడు

  • అమరావతి రైతుల కోరిక నెరవేరిందన్న వెంకయ్యనాయుడు
  • మొదటి నుంచి తాను ఒకే రాజధాని ఉండాలని కోరుకున్నానని వెల్లడి
  • రాజధాని లేని రాష్ట్రం తల లేని మొండెం వంటిదని స్పష్టీకరణ
భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనేక అడ్డంకులు, ఇబ్బందులు, కష్టనష్టాలను ఎదుర్కొని వేలాది రోజుల పాటు ఉద్యమం సాగించిన అమరావతి రైతుల అభీష్టం నెరవేరిందని తెలిపారు. 

నిన్న నూతనంగా పదవీ ప్రమాణం చేసిన ఏపీ ముఖ్యమంత్రి అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. మొదటి నుంచి కూడా తాను రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని ఆకాంక్షించానని తెలిపారు. రాజధాని లేని రాష్ట్రం తల లేని మొండెం వంటిదని అభివర్ణించారు. రాజధాని ఒక్కటే ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తెలిపారు. 

ఏపీ కానివ్వండి, మరే రాష్ట్రమైనా కానివ్వండి... సమగ్రాభివృద్ధి ఎంతో అవసరం అని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం తప్పు కాదని అన్నారు.


More Telugu News