అప్పుడు చూసుకుందాం వీళ్ల సంగతి... ఎమ్మెల్సీలతో సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు

  • ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం
  • ప్రస్తుతం కూటమి హనీమూన్ నడుస్తోందన్న జగన్
  • శిశుపాలుడి మాదిరి చంద్రబాబు తప్పులను కూడా లెక్కిద్దామని పిలుపు
  • చంద్రబాబు పాలనలో త్వరగా తప్పులు పండుతాయని వెల్లడి
ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ కూటమి హనీమూన్ నడుస్తోందని, వాళ్లకు కొంత సమయం ఇచ్చిన తర్వాత పోరాటం మొదలుపెడదామని మాజీ సీఎం జగన్ అన్నారు. ఇవాళ ఆయన వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో పాపాలు చాలా త్వరగా పండుతాయని, గతంలోనూ చంద్రబాబు పాపాలు ఎలా పండాయో అందరం చూశామని తెలిపారు. శిశుపాలుడి నూరు తప్పుల మాదిరిగా చంద్రబాబు తప్పులను కూడా లెక్కిద్దామని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లి ముమ్మరంగా పోరాటం సాగిద్దామని పేర్కొన్నారు. 

అసెంబ్లీలో వైసీపీకి ఏమంత బలం లేదని, దాంతో అక్కడ అధికార పక్షానిదే ఆధిపత్యం ఉంటుందని జగన్ పేర్కొన్నారు. అయితే మండలిలో వైసీపీకి బలం ఉన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. తమను ఎవరూ ఏమీ చేయలేరని, మహా అయితే నాలుగు కేసులు పెడతారేమో అని జగన్ వ్యాఖ్యానించారు. 

"ఇటీవలి ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయి. ఈవీఎంల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. గత కొన్ని రోజులుగా జరిగిన పరిస్థితులు మీకు తెలుసు. ఎన్నికల  ఫలితాలతో మనో స్థైర్యాన్ని కోల్పోవద్దు. మేనిఫెస్టోను పరమ పవిత్రంగా భావించి 99 శాతం హామీలు అమలు చేశాం. ఫలానా పథకం అమలు జరిగిందా, లేదా అనేది ప్రజలను అడిగి మరీ టిక్ పెట్టించాం. ప్రజామోదం పొందిన తర్వాత ఎన్నికలకు వెళ్లాం... కానీ ఎన్నికల్లో ఏం జరిగిందో అర్థం కావడంలేదు. 

2019 నుంచి 2024 వరకు కాలం వేగంగా గడిచిపోయింది. 2029 కూడా అంతే వేగంగా వస్తుంది. సినిమాలో ఇది ఫస్ట్ హాఫ్ మాత్రమే... సెకండాఫ్ మిగిలే ఉంది. గతంలోనూ ఇలాంటి సంక్షోభ పరిస్థితుల నుంచి పైకి లేచాం. ఇటీవల ఎన్నికల్లో మనకు 40 శాతం ఓట్లు వచ్చాయి... అంటే దానర్థం ఇంటింటికీ మనం చేసిన మంచి బ్రతికే ఉంది. వాళ్ల పాపాలు పండనిద్దాం... ఆ తర్వాత మనమేంటో చూపిద్దాం. 

ఓటు వేయని వాళ్లపై అమానవీయ రీతిలో దాడులు చేస్తున్నారు... ఇదొక పాపం. కేంద్రంలో చంద్రబాబుకు అనుకూల పరిస్థితులు ఉండి కూడా ప్రత్యేక హోదా అడగకపోవడం రెండో పాపం. రాబోయే రోజుల్లో వీళ్లు ఇంకా చాలా పాపాలు చేస్తారు. ఆ పాపాలన్నీ పండేవరకు మనం ధైర్యంగా నిలబడాలి. 

ఇక, అసెంబ్లీలో మనకున్న సంఖ్యాబలం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తారా అనేది సందేహమే. ఓటు వేయలేదని ఆస్తులకు నష్టం కలిగిస్తూ, వ్యక్తులపై దాడులు చేస్తున్న వీళ్లకు మనకు ప్రతి పక్ష హోదా ఇచ్చేంత నైతిక విలువలు ఉన్నాయా? అనేది కూడా సందేహమే. మనం కచ్చితంగా ప్రజల్లోనే ఉందాం. రోజులు గడిచే కొద్దీ మనం మరింతగా ప్రజల్లోకి వెళదాం. 

గతంలో నేను 14 నెలల పాటు పాదయాత్ర చేశాను. ఆ వయసు, ఆ సత్తువ నాలో ఇప్పటికీ ఉన్నాయి. ప్రజలతో కలిసి పోరాటం ముమ్మరం చేద్దాం. మనం చేయాల్సిందల్లా వాళ్ల పాపాలు పండేదాకా వేచి చూడడమే!" అంటూ జగన్ వైసీపీ ఎమ్మెల్సీలకు ధైర్యం నూరిపోశారు.


More Telugu News