ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు.. ముంబై వైద్యుడికి షాకింగ్ అనుభవం!

  • నిన్న ముంబైలో వెలుగు చూసిన ఘటన 
  • ఆన్‌లైన్‌లో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన వైద్యుడు ఓర్లెమ్‌ బ్రెండన్‌ సెర్రావోకి  
  • యుమ్మో ఫ్లేవర్డ్‌ బటర్‌స్కాచ్ కోన్‌ ఐస్‌క్రీమ్‌లో వచ్చిన మనిషి వేలు
  • ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఐస్ క్రీం నమూనాను ల్యాబ్ కు పంపిన పోలీసులు
దేశ ఆర్థిక రాజధాని ముంబైకి చెందిన ఓ వైద్యుడికి ఊహించని అనుభవం ఎదురైంది. ఆన్‌లైన్‌లో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తే అందులో మనిషి వేలు వచ్చింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని మలాడ్ ప్రాంతానికి చెందిన యువ వైద్యుడు ఓర్లెమ్‌ బ్రెండన్‌ సెర్రావోకి ఐస్‌క్రీమ్‌ తినాలనిపించింది. దీంతో వెంటనే తన ఫోన్‌ తీసుకుని ఆన్‌లైన్ యాప్ ద్వారా యుమ్మో ఐస్‌ క్రీమ్స్‌ షాప్‌నుంచి మూడు యుమ్మో ఫ్లేవర్డ్‌ బటర్‌స్కాచ్ కోన్‌ ఐస్‌క్రీమ్స్ ను ఆర్డర్‌ పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత ఐస్ క్రీమ్స్‌ ఇంటికి డెలివరీ అయ్యాయి. 

దాంతో ఎంతో ఆశగా ఓ ఐస్‌క్రీమ్‌ను తీసుకుని తినడం మొదలు పెట్టాడు. ఇంతలో నాలుకకు ఏదో గట్టి పదార్థం తగిలినట్లు అనిపించింది. అది ఏదైనా నట్‌ లేదా చాక్లెట్‌ ముక్క కావొచ్చని ముందుగా భావించాడు. కానీ, అనుమానం వచ్చి ఐస్‌క్రీమ్‌ను పరిశీలించి చూశాడు. అప్పుడు గోరుతో కూడిన రెండు అంగుళాల మనిషి చేతి వేలు కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. వెంటనే మలాడ్‌లోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వైద్యుడి పిర్యాదుపై స్పందించిన పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం పోలీసులు ఐస్ క్రీం నమూనాను ల్యాబ్ కు పంపారు. 

"ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు ముక్కగా అనుమానించబడిన మాంసం ముద్ద వచ్చింది. అది మానవ శరీరంలో భాగమా? కాదా? అని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపబడింది" అని పోలీసులు తెలిపారు.

ఇక తనకు ఎదురైన ఈ షాకింగ్ ఘటనపై ఓర్లెమ్‌ బ్రెండన్‌ సెర్రావోకి మాట్లాడుతూ.. "నిన్నటి నుండి నా నాలుకపై తిమ్మిరిగా ఉంది. నా నోటిలో మనిషి శరీర భాగాన్ని పెట్టుకున్నానని గుర్తొచ్చినప్పుడల్లా ఎలాగో ఉంటోంది  మొదట నేను ప్యాకేజీని చూసినప్పుడు అది ఒక నెల క్రితం ప్యాక్ అయినట్లు గుర్తించాను. ఇది కచ్చితంగా మానవ తప్పిదమే. ఇప్పుడు నేను ఐస్ క్రీం గురించి ఆలోచించినప్పుడు నాకు పీటీఎస్డీ (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్) ఉన్నట్లుగా బాధపడుతున్నాను. ఆ మనిషి వేలు కారణంగా ఐస్ క్రీము కలుషితమయ్యే అవకాశం వుంది కాబట్టి ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.


More Telugu News