జగన్ ఫొటో ఉన్నా కిట్స్ పంపిణీ చేయండి.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

  • ఏపీలో మొదలైన చంద్రబాబు మార్కు పాలన
  • ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో మార్పు చూపించిన టీడీపీ అధినేత 
  • ప్రజాధనం దుర్వినియోగం చేయవద్దంటూ జగన్ ఫొటో ఉన్నా కిట్స్ పంపిణీ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు
  • చంద్రబాబు నిర్ణయంపై టీడీపీ ఆసక్తికర ట్వీట్  
చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మార్కు పాలన మొదలైంది. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పాలనలో మార్పు చూపించారు. ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు, పగ  ఉండవని నిరూపించారు. రాష్ట్రంలో స్కూల్స్ పున:ప్రారంభమైన నేపథ్యంలో జగన్ ఫొటో ఉన్నా సరే విద్యార్థులకు ఆ కిట్ లనే పంపిణీ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేయవద్దంటూ చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

చంద్రబాబు నిర్ణయంపై టీడీపీ ఆసక్తికర ట్వీట్ 
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఎంత తేడా అంటూ తెలుగుదేశం పార్టీ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు పేరొస్తుందని, వైఎస్ జగన్ తన హయాంలో పేదలకు తక్కువ ఖర్చుతో అన్నం పెట్టే  అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టాడని పేర్కొంది. కానీ చంద్రబాబు మాత్రం ప్రజాధనం వృథా అవకూడదని భావించి మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్ ను విద్యార్థులకు అలాగే పంపిణీ చేయాలని ఆదేశించారు. 

ప్రజాధనం వృథా అవకూడదని ఆలోచించే చంద్రబాబుకు, మాజీ సీఎం జగన్ కు చాలా వ్యత్యాసం ఉందని టీడీపీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. తన పాలనలో కక్ష సాధింపు చర్యలు ఉండవని, పగ ప్రతీకారాలకు తావులేదని, తుగ్లక్ నిర్ణయాలు అసలే ఉండవని చంద్రబాబు చెప్పారు. తాను చెప్పిన మాట మేరకు.. పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడని భావించి జగన్ బొమ్మ ఉన్న స్కూల్  కిట్స్ ను విద్యార్థులకు అలాగే పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారని పేర్కొంటూ ఓ న్యూస్ క్లిప్‌ను టీడీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.


More Telugu News