మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. అంత్యక్రియలు జరిగి 13 రోజులు గడిచిన తర్వాత.. ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తి!

  • మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ జిల్లాలో ఘటన 
  • రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని గుర్తించి అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు
  • 13 రోజుల తర్వాత సరాసరి ఇంటికి వచ్చిన వ్యక్తి
  • అతడు బతికే ఉన్నాడని తెలుసుకుని కుటుంబీకుల షాక్‌
మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని గుర్తించిన కుటుంబం సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అంత్యక్రియలు జరిగి 13 రోజులు గడిచిన తర్వాత ఆ వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు బతికే ఉన్నాడని తెలుసుకున్న కుటుంబీకులు షాక్‌ అయ్యారు. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 

వివరాల్లోకి వెళితే.. షియోపూర్‌ జిల్లా లహచోరా గ్రామానికి చెందిన సురేంద్ర శర్మ.. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని బట్టల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. కాగా, రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ సమీపంలోని సుర్వాల్‌లో గత నెల 26న రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చనిపోయిన వ్యక్తిని గుర్తించాలని కోరుతూ  ఓ ఫొటోను అధికారులు ప్రచురించడం జరిగింది. అయితే, ఆ వ్యక్తిని సురేంద్రగా అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు. 

దీంతో రాజస్థాన్‌ పోలీసులు పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని సురేంద్ర ఫ్యామిలీకి అప్పగించారు. దాంతో వారు అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు 13వ రోజున సురేంద్రకు దశ దిన కర్మలు చేసేందుకు అతడి ఫ్యామిలీ సిద్ధమైంది. సరిగ్గా అదే రోజు సురేంద్ర సరాసరి ఇంటికి వచ్చి కళ్లముందు ప్రత్యక్షమవడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఈ విషయాన్ని వెంటనే రాజస్థాన్‌ పోలీసులకు తెలియజేశారు. వారి సమాచారంతో అలర్ట్ అయిన పోలీసులు దర్యాప్తు చేసి చనిపోయిన వ్యక్తిని ధారా సింగ్ గా గుర్తించారు.    

ఆ తర్వాత ధారా సింగ్ కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు. పొరపాటున అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. అయితే, ధార బంధువులు అక్రమ అంత్యక్రియలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సురేంద్ర మామ ధర్మ్ రాజ్ శర్మ మాట్లాడుతూ.. చనిపోయిన వ్యక్తి, సురేంద్ర మధ్య దగ్గర పోలికల కారణంగా తప్పుగా గుర్తించడం జరిగిందన్నారు. పైగా అతని నుండి గత రెండు నెలలుగా కమ్యూనికేషన్ లేకపోవడం కూడా ఇలా జరగడానికి ఒక కారణమని వివరించారు. 

సురేంద్ర సోదరుడు దేవేంద్ర జైపూర్ పోలీసులు పంచుకున్న ఫొటోలు, వీడియోల ఆధారంగా మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. సురేంద్ర కుటుంబ సభ్యుల తప్పుగా గుర్తించి, ధారా సింగ్ దహన సంస్కారానికి పాల్పడినందుకు వారిపై చర్యలు తీసుకోవాలనే యోచనలో అధికారులు ఉన్నారు.


More Telugu News