కువైట్ అగ్ని ప్రమాదం... ప్రధాని మోదీ ఆదేశాలతో గల్ఫ్‌కు కేంద్రమంత్రి పయనం!

  • కువైట్ అగ్నిప్రమాద ఘటనలో 40 మంది భారతీయుల మృతి
  • ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం
  • తక్షణమే కువైట్ వెళ్లాలని కేంద్రమంత్రి కీర్తివర్ధన్ సింగ్‌కు ప్రధాని ఆదేశం
  • ప్రధానితో భేటీ అనంతరం కువైట్ బయలుదేరనున్న కేంద్రమంత్రి
కువైట్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తక్షణమే కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్‌ను ఆదేశించారు. దీంతో కేంద్రమంత్రి కువైట్‌కు బయలుదేరనున్నారు. ప్రధాని మోదీతో భేటీ ముగిసిన తర్వాత తాను బయలుదేరనున్నట్లు ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా మృతదేహాలను భారత్‌కు రప్పించేందుకు స్థానిక అధికారులతో ఆయన సమన్వయం చేయనున్నారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్రమంత్రిని గల్ఫ్‌కు పంపిస్తున్నట్లు విదేశాంగ శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

కువైట్ అగ్నిప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 50 మంది మరణించగా... అందులో 40 మంది భారతీయులు ఉన్నారు. గాయపడిన వారిలోనూ చాలామంది భారతీయులు ఉన్నారు. బాధితులకు అండగా నిలబడేందుకు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులో ఉంచినట్లు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కువైట్ ప్రమాద ఘటనలో మృతి చెందినవారిలో ఎక్కువగా కేరళ, తమిళనాడుకు చెందినవారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ రాశారు. బాధితుల్లో ఎక్కువగా మలయాళీలు ఉన్నారని... వారికి తక్షణమే సహాయం అందించాలని కోరారు.


More Telugu News