యూట్యూబ‌ర్ ప్రాణాలు బ‌లిగొన్న దాయాదుల క్రికెట్ పోరు.. ఆల‌స్యంగా వెలుగులోకి ఘ‌ట‌న!

  • న్యూయార్క్‌ వేదికగా జూన్ 9న భారత్, పాకిస్థాన్ మ్యాచ్
  • మ్యాచ్ రోజే పాకిస్థాన్‌లో విషాదం 
  • మ్యాచ్ గురించి స‌ర‌దాగా వ్లాగ్ చేయ‌బోయిన సాద్ అహ్మ‌ద్ అనే యూట్యూబ‌ర్‌
  • సాద్‌ను కాల్చి చంపేసిన సెక్యూరిటీ గార్డ్
టీ20 ప్రపంచ క‌ప్‌లో భాగంగా న్యూయార్క్‌ వేదికగా జూన్ 9న భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో టీమిండియా విజయం సాధించింది. దీంతో న్యూయార్క్‌తో పాటు ఇండియా అంతటా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే, పాకిస్థాన్‌లో మాత్రం మ్యాచ్ రోజే విషాదం నెల‌కొంది. దాయాదుల పోరు ఓ యూట్యూబ‌ర్ ప్రాణాలు బ‌లిగొన్న ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. పాకిస్థాన్‌లో ఈ మ్యాచ్ గురించి స‌ర‌దాగా వ్లాగ్ చేయ‌బోయిన సాద్ అహ్మ‌ద్ అనే యూట్యూబ‌ర్‌ను ఓ సెక్యూరిటీ గార్డ్ తుపాకీతో కాల్చి చంపేశాడు.

వివరాల్లోకి వెళితే.. చిర‌కాల ప్ర‌త్య‌ర్థుల మ్యాచ్‌పై జ‌నాల అభిప్రాయం తెలుసుకోవాల‌ని సాద్ అహ్మ‌ద్ అనుకున్నాడు. అందులో భాగంగా జూన్ 9వ తేదీన అత‌డు క‌రాచీలోని మొబైల్ మార్కెట్‌కు వెళ్లాడు. అక్క‌డ ఉన్న‌వాళ్ల‌ను ప‌ల‌క‌రించి భారత్, పాక్ మ్యాచ్‌పై వాళ్ల అభిప్రాయం తీసుకున్నాడు. మ్యాచ్‌లో ఎవ‌రు గెలుస్తారు? అత్య‌ధిక స్కోర్ కొట్టేది ఎవ‌రు? ఇలా ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు అడిగిన సాద్ వాళ్ల‌తో వ్లాగ్ తీశాడు.

ఈ క్రమంలో అక్క‌డే ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్‌ను సాద్.. టీమిండియా, పాక్ మ్యాచ్ గురించి అడిగాడు. కానీ, సెక్యూరిటీ గార్డ్ మాత్రం స్పందించ‌లేదు. అయినా స‌రే సాద్ అత‌డిని ప్ర‌శ్న‌ల‌తో విసిగించాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన స‌ద‌రు సెక్యూరిటీ గార్డ్ త‌న వద్ద ఉన్న తుపాకీతో సాద్‌పై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ సాద్‌ను స్థానికులు వెంట‌నే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, మార్గ మ‌ధ్యంలోనే అత‌డు చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.


More Telugu News