తప్పు చేసినవారిని వదిలిపెట్టబోను.. చంద్రబాబు వార్నింగ్

  • తప్పు చేసినవాడిని క్షమించి వదిలిపెడితే అది అలవాటుగా మారుతుందన్న చంద్రబాబు  
  • తప్పు చేసినవాళ్లకు చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య 
  • విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని హితవు
తప్పు చేసినవారిని వదిలిపెట్టబోనని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. "తప్పు చేసినవాడిని క్షమించి, పూర్తిగా వదిలిపెడితే అది అలవాటుగా మారుతుంది. తప్పు చేసినవాళ్లకు చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి. పదవి వచ్చిందని విర్రవీగొద్దు. వినయంగా ఉండాలి" అని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా తాను బుధవారం నాలుగోసారి ప్రమాణం చేయబోతున్నానని.. రేపటి ప్రమాణానికి ఉన్న ప్రాధాన్యత వేరని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ హామీ ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో మనపై బాధ్యత పెరిగిందన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు పవన్‌ కల్యాణ్ వచ్చి పరామర్శించడమే కాకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారని బాబు గుర్తు చేశారు. జనసేన, బీజేపీతో పొత్తు కలిసొచ్చిందన్నారు. 

ఇక పవన్‌, తాను కలిసి జిల్లా పర్యటన చేశామన్నారు. అటు బీజేపీ అగ్రనేతలు కూడా రాష్ట్రంలో పర్యటించారని, విజయవాడలో కూటమి రోడ్ షోను మోదీ అభినందించారని గుర్తుచేశారు. తాను ఎప్పుడూ రాగద్వేషాలకు అతీతంగా పనిచేశానని పేర్కొన్నారు. తనకు ప్రజాహితమే తెలుసన్నారు.


More Telugu News