ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

  • హైవేపై రెడీమిక్స్ వాహనం బ్రేక్ డౌన్
  • రోడ్డు పక్కగా నిలిపి రిపేర్ చేయిస్తున్న డ్రైవర్
  • వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టిన టాటా ఏస్
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలను ఇంటికి తీసుకెళుతున్న టాటా ఏస్ రోడ్డు పక్కన నిలిపి ఉంచిన రెడీమిక్స్ వాహనాన్ని ఢీ కొట్టడంతో ముగ్గురు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని క్యాన్సర్ ఆసుపత్రి ముందు సోమవారం రాత్రి చోటుచేసుకుందీ ప్రమాదం. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న రెడీమిక్స్ వాహనం పెదకాకాని సమీపంలో హైవేపై బ్రేక్ డౌన్ అయింది. దీంతో వాహనాన్ని రోడ్డుకు కుడి పక్కన నిలిపిన డ్రైవర్.. మెకానిక్ ను తీసుకొచ్చి రిపేర్ చేయిస్తున్నాడు.

ఇంతలో ఓ కారు వేగంగా వచ్చి రెడీమిక్స్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ వేగానికి రెడీమిక్స్ వాహనం రోడ్డు మధ్యలోకి వచ్చింది. అప్పుడే అటుగా వెళుతున్న టాటా ఏస్ ఈ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడగా.. టాటా ఏస్ ప్రయాణికుల్లో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మిగతా ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

టాటా ఏస్ లో ఇంటికి వెళుతున్న కూలీల్లో పేరేచర్ల గ్రామానికి చెందిన కె.రాంబాబు(40), గుంటూరుకు చెందిన తేజ(21), పాత గుంటూరుకు చెందిన డి.మధు(25) మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అలంకరణ పనులకు వెళ్లి వస్తున్న కూలీలు మరికాసేపట్లో ఇంటికి చేరతామనే లోపే ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని గుంటూరులోని ఆసుపత్రులలో చేర్పించి, చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


More Telugu News