ఇక రాజకీయాలకు గుడ్ బై: కేశినేని నాని ప్రకటన

  • రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేసిన కేశినేని నాని
  • తన రాజకీయ ప్రస్థానం ఇంతటితో ముగిసిందని స్పష్టీకరణ
  • విజయవాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడి
సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీని వీడి, వైసీపీలో చేరి, ఎన్నికల్లో సొంత తమ్ముడి చేతిలో ఘోరంగా ఓడిపోయిన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేశారు. ఇంతటితో తన రాజకీయ ప్రస్థానం ముగిసిందని వెల్లడించారు. 

అనేక అంశాలను, వివిధ వైపుల నుంచి వచ్చిన ప్రతిస్పందనలను జాగ్రత్తగా గమనించిన మీదట ఇక రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని తెలిపారు. రెండు పర్యాయాలు విజయవాడ ఎంపీగా ప్రజలకు సేవ చేయడాన్ని తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తానని కేశినేని నాని పేర్కొన్నారు. 

"విజయవాడ ప్రజల స్థైర్యం, వారి దృఢసంకల్పం నాకు స్ఫూర్తినిస్తాయి. వారి అచంచలమైన మద్దతుకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నప్పటికీ, విజయవాడపై నా అంకితభావం బలంగానే ఉంటుంది. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగినంత సాయం చేస్తూనే ఉంటాను. 

ఇప్పుడు నా జీవితంలో మరొక అధ్యాయం మొదలవుతోంది. ఎంతో విలువైన జ్ఞాపకాలను, అమూల్యమైన అనుభవాలను నాతో తీసుకువెళుతున్నాను. విజయవాడ అభివృద్ధి కోసం పరితపించే కొత్త ప్రజాప్రతినిధులకు నా శుభాకాంక్షలు. 

పదేళ్లపాటు సేవలు అందించే అవకాశాన్ని ఇచ్చిన విజయవాడ ప్రజలకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అంటూ కేశినేని నాని తన ప్రకటనలో పేర్కొన్నారు.


More Telugu News