సురేశ్ గోపి అసంతృప్తిగా ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం: కేరళ బీజేపీ చీఫ్

  • కొందరు జర్నలిస్టులు కేరళ బీజేపీ యూనిట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • సహాయమంత్రి పదవిపై అసంతృప్తితో తప్పుకున్నట్లు వచ్చిన వార్తలను ఖండించిన సురేంద్రన్
  • రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా తానూ తప్పుకుంటున్నట్లు ప్రచారం చేశారని మండిపాటు
కేంద్రమంత్రి పదవి నుంచి త్రిస్సూర్ ఎంపీ సురేశ్ గోపి తప్పుకోనున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ అన్నారు. కేంద్రమంత్రి పదవిపై సురేశ్ గోపి అసంతృప్తిగా ఉన్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కొందరు జర్నలిస్టులు కేరళ బీజేపీ యూనిట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్రిస్సూర్ నుంచి పోటీ చేసిన సురేశ్ గోపిని ఓడించాలని కేరళ బీజేపీ యూనిట్ ప్లాన్ చేసినట్లు మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సురేశ్ గోపి నిన్న సాయంత్రం కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సినిమాల బిజీ షెడ్యూల్ కారణంగా తనకు కేంద్ర సహాయమంత్రి పదవి వద్దని ఆయన అంటున్నట్టు, కేబినేట్ మంత్రి పదవి ఆశిస్తే సహాయమంత్రి పదవి ఇవ్వడంపై అసంతృప్తితోనే ఆయన అలా అంటున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని కేరళ బీజేపీ చీఫ్ ఖండించారు. రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తనపై కూడా ప్రచారం జరిగిందని పేర్కొన్నారు.


More Telugu News