మోదీ 3.0 కేబినెట్‌లో ఆరుగురు న్యాయవాదులు

  • మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసిన ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ 
  • ఎంబీఏ పూర్తి చేసిన ముగ్గురు మంత్రులు
  • పోస్టు గ్రాడ్యుయేషన్ పాసైన 10 మంది మినిస్టర్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ ఆదివారం రాత్రి కొలువుదీరింది. మొత్తం 72 మందితో కేంద్ర మంత్రి మండలి ఏర్పడింది. 30 మంది కేబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఆసక్తికరంగా కేంద్ర కేబినెట్ హోదా దక్కించుకున్న మంత్రుల్లో ఏకంగా ఆరుగురు న్యాయవాదులు ఉన్నారు. ఇక ముగ్గురు ఎంబీఏ డిగ్రీ పొందినవారు, పది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్‌సింగ్‌ మాస్టర్స్ డిగ్రీలు చేయగా... మంత్రుల జాబితాలో నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, భూపేందర్ యాదవ్, కిరెన్ రిజిజు న్యాయవాద పట్టాలు పొందారు.

ఇక రాజ్‌నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్. జైశంకర్, ధర్మేంద్ర ప్రధాన్, డాక్టర్ వీరేంద్ర కుమార్, మన్సుఖ్ మాండవీయ, హర్దీప్ సింగ్ పూరి, అన్నపూర్ణా దేవి, గజేంద్ర సింగ్ షెకావత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మరోవైపు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్న మనోహర్ లాల్, హెచ్‌డీ కుమారస్వామిలతో పాటు జితన్ రామ్ మాంఝీ, రాజీవ్ రంజన్ (లలన్ సింగ్), ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్‌లతో సహా ఆరుగురు మంత్రులు పట్టభద్రులుగా ఉన్నారు.


More Telugu News