అమరావతి రాజధాని ప్రాంతంలో సీఎస్ నీరబ్ కుమార్ సుడిగాలి పర్యటన

  • ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టీడీపీ కూటమి
  • ఇటీవల నూతన సీఎస్ గా నియమితులైన నీరబ్ కుమార్ ప్రసాద్
  • రాజధాని ప్రాంతంలో మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణాలను నేడు పరిశీలించిన వైనం
ఏపీలో కొత్త ప్రభుత్వం వస్తున్న నేపథ్యంలో, ఇటీవలే నూతన సీఎస్ గా నియమితులైన నీరబ్ కుమార్ ప్రసాద్ నేడు అమరావతి రాజధాని ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో, సీఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

రాజధాని ప్రాంతంలో అసంపూర్తి నిర్మాణ పనులతో మధ్యలోనే ఆగిపోయిన వివిధ భవన నిర్మాణాలను సీఎస్ పరిశీలించారు. రాజధాని ప్రాంతంలో గతంలో భూమి పూజ జరిగిన ఉద్ధండరాయునిపాలెంలో సీఆర్డీయే ప్రాజెక్టు స్థలాన్ని కూడా సందర్శించారు.

ఐఏఎస్, ఐపీఎస్ ల నివాస సముదాయాలు, ప్రజాప్రతినిధుల క్వార్టర్లు, ఎన్జీవోల నివాస భవనాలు, సముదాయాలను కూడా సీఎస్ నీరబ్ కుమార్ పరిశీలించారు. అనంతరం, హైకోర్టు అదనపు భవనాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. 

ఈ పర్యటనలో సీఎస్ తో పాటు సీఆర్డీయే కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 


More Telugu News