నితీశ్ కు ప్రధాని పదవి ఆఫర్ ఇచ్చారా.. ఎవరు, ఎప్పుడు?: జేడీయూ ఎంపీ

నితీశ్ కు ప్రధాని పదవి ఆఫర్ ఇచ్చారా.. ఎవరు, ఎప్పుడు?: జేడీయూ ఎంపీ
  • ఇండియా కూటమి నితీశ్ కు ప్రధాని పదవి ఆఫర్ చేసిందన్న త్యాగి
  • అలాంటి ఆఫర్ ఏదీ రాలేదని కుండబద్దలు కొట్టిన జేడీయూ ఎంపీ సంజయ్ ఝా
  • త్యాగి ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని వివరణ
లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయే కూటమిలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తిరిగి ఇండియా కూటమిలో చేరితే నితీశ్ కు ప్రధాని పదవి ఇస్తామంటూ ఆఫర్ వచ్చిందని జేడీయూ నేత కేసీ త్యాగి ఇటీవల బాంబు పేల్చారు. అయితే, అదంతా అబద్ధమని సొంత పార్టీ ఎంపీ సంజయ్ ఝా తేల్చిచెప్పారు. తనకు తెలిసినంత వరకూ అలాంటి ఆఫర్ ఏదీ ఇండియా కూటమి నుంచి రాలేదని స్పష్టం చేశారు. నితీశ్ కుమార్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందిన సంజయ్ ఝా వివరణతో కేసీ త్యాగి వ్యాఖ్యలు అబద్దమని తేలిపోయింది. మరోవైపు, ఇండియా కూటమి నుంచి కూడా ఈ విషయంపై స్పష్టత వచ్చింది. కూటమి తరఫున నితీశ్ కు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తేల్చిచెప్పారు. త్యాగి వ్యాఖ్యలపై వేణుగోపాల్ స్పందిస్తూ.. ‘త్యాగి వ్యాఖ్యల్లో వాస్తవం లేదు. ఫలితాలు వెలువడ్డాక కూటమి నుంచి ఎవరూ నితీశ్ ను సంప్రదించలేదు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా నితీశ్ కు ప్రధాని పదవి ఎవరు ఎప్పుడు ఆఫర్ చేశారో తెలియదు. బహుశా కేసీ త్యాగికి మాత్రమే ఈ ఆఫర్ గురించి తెలిసి ఉంటుంది’ అంటూ ఎద్దేవా చేశారు.

సంజయ్ ఝా ఏమన్నారంటే..
‘ఇండియా కూటమి నితీశ్‌కు ప్రధాని పదవి ఆఫర్ చేసిందన్న సమాచారం మా పార్టీకి అందలేదు. నితీశ్‌కు సైతం ఈ విషయం తెలియదు. నాకు తెలిసి అలాంటి ఆఫర్ ఏదీ రాలేదు. త్యాగి ఎందుకలా మాట్లాడారో నాకు తెలియదు’ అన్నారు.

ఇండియా కూటమి ఆఫర్ పై త్యాగి వ్యాఖ్యలు ఇవే..
‘నితీశ్ కుమార్ కు ఇండియా కూటమి నుంచి ప్రధాని పదవి ఇస్తామంటూ ఆఫర్ వచ్చింది. కూటమి కన్వీనర్ పదవి నితీశ్ కు ఇవ్వొద్దన్న వ్యక్తుల నుంచే ఇప్పుడు ప్రధాని పదవి ఇస్తామంటూ ఆఫర్ వచ్చింది. అయినా ఎన్డీయేను వీడేదిలేదంటూ నితీశ్ ఆ ఆఫర్ ను తిరస్కరించారు’ అంటూ ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో త్యాగి చెప్పారు.


More Telugu News