కేంద్ర కేబినెట్‌లోకి మాజీ సీఎం కుమారస్వామి!.. ఎన్డీయే నేతల పేర్లు ఇవే!

  • ఎన్డీయే పార్టీలకు చెందిన కీలక వ్యక్తులకు పదవులు
  • జేడీయూ ఎంపీ రామ్‌నాథ్ ఠాకూర్, చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ, అనుప్రియా పటేల్,జయన్ చౌదరి‌లకు కూడా అవకాశం!
  • టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లకు ఛాన్స్
  • జాతీయ మీడియా వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న పేర్లు
మరికొన్ని గంటల్లోనే ‘మోదీ 3.0’ ప్రభుత్వం కొలువు తీరనుంది. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి 7గంటల 15 నిమిషాలకు నరేంద్ర మోదీ పట్టాభిషేకం జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే ఘనమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి విశిష్ట అతిథులు కూడా హాజరు కానున్నారు. అయితే మోదీతో పాటు కేంద్ర కేబినెట్ మంత్రులుగా ఎవరెవరు ప్రమాణస్వీకారం చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీయే కూటమిలోని పార్టీలకు సంబంధించిన పలువురు ఎంపీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.

ఫోన్లు వచ్చింది వీరికే!
బీజేపీ టాప్ లీడర్లు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి సీనియర్ నేతలు మరోసారి అత్యున్నత స్థాయి కేబినెట్ మంత్రి పదవులు దక్కించుకోనున్నారు. ఎన్డీయే పార్టీలకు సంబంధించి నితీష్ కుమార్ సారధ్యంలోని జేడీయూ నుంచి ఎంపీ రామ్‌నాథ్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ఇక కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ ఎంపీ హెచ్‌డీ కుమారస్వామికి కూడా బీజేపీ పెద్దల నుంచి ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది.

ఎల్‌జేపీ (రామ్‌విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, హెచ్‌ఏఎం అధినేత జితన్ రామ్ మాంఝీ, అప్నాదళ్ (ఎస్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్, ఆర్‌ఎల్‌డీకి చెందిన జయన్ చౌదరి కూడా మోదీ 3.0 ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వీరంతా మోదీతో పాటు నేడే (ఆదివారం) ప్రమాణస్వీకారం చేయనున్నారని జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

ఇక బీజేపీ తరపున వినిపిస్తున్న పేర్లలో లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, బసవరాజ్ బొమ్మై, మనోహర్ లాల్ ఖట్టర్, సర్బానంద సోనోవాల్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మంత్రి పదవుల కోసం వీరు కూడా గట్టిగా పోరాడుతున్నట్టు సమాచారం. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.


More Telugu News