కేంద్రంలో మంత్రి పదవుల కంటే రాష్ట్రాభివృద్ధే మాకు ముఖ్యం: రామ్మోహన్ నాయుడు

  • ఎన్డీయే గెలుపు కోసం కృషి చేశామని ఎంపీ రామ్మోహన్ నాయుడు వెల్లడి
  • ఏపీకి న్యాయం చేయడం గురించే తమ ఆలోచన అని స్పష్టీకరణ
  • మంత్రి పదవుల కంటే కేంద్రం సహకారం చాలా ముఖ్యమని వ్యాఖ్యలు
  • చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఉద్ఘాటన
టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తాజా రాజకీయ పరిణామాలపై సోషల్ మీడియాలో స్పందించారు. ఎన్డీయే గెలవాలని కృషి చేశామని, తాము కోరుకున్నట్టుగానే కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయని, ప్రజలు ఎన్డీయేకి ఏ విధంగా పట్టం కట్టారో అందరం కళ్లారా చూశాం అని వెల్లడించారు. 

రాష్ట్రంలో ఊహించని రీతిలో విజయం సాధించామని, ఎన్డీయే కూటమి పట్ల తమకు సంపూర్ణమైన నమ్మకం ఉందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఏపీకి ఏ విధంగా న్యాయం చేయడానికి మార్గాలు ఉన్నాయో, అందుకు అనుగుణంగానే తమ ఆలోచన ఉంటుందని అన్నారు. 

ఏదో ఒక మంత్రి పదవి తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి అనే కంటే... రాష్ట్రానికి న్యాయం చేయాలి, ప్రాజెక్టులు పూర్తి చేయాలి, అమరావతి క్యాపిటల్ నిర్మించాలి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి, రెవెన్యూ లోటును భర్తీ చేయాలి, వెనుకబడిన జిల్లాలకు న్యాయం చేయాలి... అనే అంశాలకే తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని రామ్మోహన్ నాయుడు వివరించారు. 

"ఇవన్నీ సాకారం కావాలంటే కేంద్రం నుంచి సహకారం కావాలి... దానిపైనే మేం దృష్టి పెడతాం. ఇవాళ ఆనందించాల్సిన విషయం ఏమిటంటే... ఎన్డీయేలో టీడీపీ మళ్లీ  ప్రధాన ప్రాత పోషిస్తోంది. గతంలో వాజ్ పేయి గారు ఉన్నప్పుడు, నాటి కూటమిలో ఇదే రకమైన పాత్ర పోషిస్తే కేంద్రం నుంచి చాలా ప్రాజెక్టులకు నిధులు తీసుకురాగలిగాం, అభివృద్ధి చేసుకోగలిగాం. 

ఈ రోజు కూడా అదే స్థాయిలో మన కేంద్ర ప్రభుత్వాన్ని వినియోగించుకుని... ఏపీలో గత ఐదేళ్లుగా జరిగిన నష్టాన్ని, అన్యాయాన్ని పూడ్చుకుని, దేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తయారుచేయాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచన. దానికి అన్ని రకాలుగా కేంద్రం నుంచి సహకారం తీసుకుంటాం. 

చంద్రబాబు తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా సరే... మేం కష్టపడి పనిచేసి ఆ నిర్ణయాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళతాం. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. టీడీపీ నాపై ఏ బాధ్యత ఉంచినా సరే... అది కష్టమైనా, అది ఏ రకమైన పనైనా సరే... ఇష్టంగా స్వీకరించి ముందుకు నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.


More Telugu News