గాజా స్కూల్ పై దాడి.. ఆ రాకెట్ ఇండియాలో తయారైందా?.. వీడియో ఇదిగో!

  • రాకెట్ శకలంపై మేడిన్ ఇండియా గుర్తు ఉందంటూ వీడియో
  • గాజాపై దాడి కోసం ఇజ్రాయెల్ కు ఇండియా ఆయుధాలు సరఫరా చేస్తోందా? అంటూ అనుమానాలు 
  • వీడియో విడుదల చేస్తూ పాలస్తీనా మీడియా ఆరోపణలు
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజాలోని పౌరులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.. గతంలో స్కూళ్లు, కాలేజీలుగా ఉన్న భవనాలలో తాత్కాలికంగా షెల్టర్ పొందుతున్నారు. గాజాలోని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడిచే ఓ స్కూల్ లోనూ అధికారులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయగా.. వందల సంఖ్యలో పౌరులు ఆశ్రయం పొందారు. అయితే, గురువారం ఈ స్కూల్ పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. దీంతో అక్కడున్న దాదాపు 40 మంది పౌరులు చనిపోయారని మీడియా కథనాలు వెలువడ్డాయి.

క్షిపణి దాడిలో దెబ్బతిన్న స్కూలు ఆవరణ, బాధితుల ఆక్రందనలను చూపించాయి. ఈ క్రమంలో పాలస్తీనా కేంద్రంగా ప్రసారమయ్యే ‘ఖుద్స్ న్యూస్ నెట్ వర్క్’ తన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ లో ఓ వీడియో విడుదల చేసింది. గాజాలోని ఐరాస స్కూల్ పై ఇజ్రాయెల్ దాడికి ఉపయోగించిన రాకెట్ శకలం అంటూ ఓ వస్తువును ఈ వీడియోలో చూపించింది. ఆ శకలంపై ‘మేడ్ ఇన్ ఇండియా’ అన్న లేబుల్ ను క్లియర్ గా చూపిస్తూ.. గాజాపై దాడి కోసం ఇజ్రాయెల్ కు ఇండియా ఆయుధాలు అందిస్తోందా అని ప్రశ్నించింది.

దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కాగా, గాజా సెంట్రల్ లోని ఐరాస స్కూల్ పై గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 35 మంది చనిపోయారని హమాస్ తొలుత ప్రకటించింది. శనివారం నాటికి మృతుల సంఖ్య 40 కి చేరిందని తెలిపింది. ఈ దాడిలో ఐదుగురు స్కూలు విద్యార్థులు కూడా కన్నుమూశారని వివరించింది.


More Telugu News