టీ20 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్

  • టీ20 వరల్డ్ కప్‌లలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన కెప్టెన్‌గా అవతరణ
  • న్యూజిలాండ్‌పై 4 వికెట్లు తీసి 17 పరుగులు మాత్రమే ఇచ్చిన రషీద్ ఖాన్
  • కివీస్‌ను 84 పరుగుల తేడాతో ఓడించి సంచలనం సృష్టించిన ఆఫ్ఘన్
టీ20 వరల్డ్ కప్2024లో శుక్రవారం రాత్రి పెను సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరేట్ జట్లలో ఒకటైన న్యూజిలాండ్‌ను ఆఫ్ఘనిస్థాన్ మట్టి కరిపించింది. ఏకంగా 84 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆఫ్ఘనిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ సంచలన రికార్డు నెలకొల్పాడు.

నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్ 4 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి తన జట్టుని విజయ తీరాలకు చేర్చడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో రషీద్ ఖాన్ సంచలన రికార్డు సాధించాడు. టీ20 వరల్డ్ కప్‌లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన కెప్టెన్‌గా నిలిచాడు. 

టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక కెప్టెన్‌గా అత్యుత్తమ గణాంకాలను రషీద్ సాధించాడు, న్యూజిలాండ్‌కు చెందిన స్టార్ ప్లేయర్ డేనియల్ వెట్టోరీ, ఒమన్‌ ఆటగాడు జీషన్ మసూద్ సంయుక్తంగా నమోదు చేసిన రికార్డును రషీద్ ఖాన్ అధిగమించాడు. 2007 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వెట్టోరి 4 వికెట్లు తీసి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ఒమన్ ఆటగాడు జీషన్.. 2021 టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో పపువా న్యూగినియాపై 4/20 గణాంకాలను నమోదు చేశాడు. ఇప్పుడు రషీద్ వీరిద్దరినీ అధిగమించాడు. రషీద్ ఖాన్ కూడా 4 వికెట్లే తీసినప్పటికీ 17 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.
  
కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయింది. టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌కు ఇది రెండవ అత్యల్ప స్కోరుగా ఉంది. 2014 ఎడిషన్‌లో శ్రీలంకపై కివీస్ కేవలం 60 పరుగులకే ఆలౌట్ అయింది.


More Telugu News