నాడు లక్ష కోట్ల విలువైన కంపెనీ.. నేడు దాని విలువ సున్నా.. బైజూస్ షేర్ పై హెచ్ఎస్ బీసీ వ్యాఖ్య

  • లీగల్ కేసులతో పాటు సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితిలో బైజూస్
  • కంపెనీ దుస్థితి నేపథ్యంలో విలువ తగ్గించిన హెచ్ఎస్ బీసీ
  • గతంలో 500 మిలియన్ డాలర్ల విలువ పలికిన స్టాక్ కు నేడు జీరో వాల్యూ
ప్రపంచ దేశాలను కరోనా వణికించిన కాలంలో బైజూస్ కంపెనీ ఓ వెలుగు వెలిగింది.. ఇంటికే పరిమితమైన పిల్లలకు, వారి భవిష్యత్తుపై తల్లిదండ్రుల టెన్షన్ కు చక్కటి పరిష్కారంగా కనిపించింది. దీంతో ఎడాపెడా లాభాలను ఆర్జించిన బైజూస్.. ఒక దశలో రూ. లక్ష కోట్ల విలువైన కంపెనీగా మారింది. బైజూస్ షేర్లు, ఆ కంపెనీలో వాటాల విలువ చుక్కల్లోకి చేరాయి. బైజూస్ మరింత ఎత్తుకు ఎదుగుతుందనే నమ్మకంతో ఓ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ అందులో పెట్టుబడులు పెట్టింది.

కంపెనీలో 10 శాతం వాటాకు అప్పట్లో ఏకంగా 500 మిలియన్ డాలర్ల (మన రూపాయల్లో 4 వేల కోట్ల పైమాటే) ను వెచ్చించింది. కొనుగోలు చేసిన తొలినాళ్లలో ఈ వాటా విలువ పెరుగుతూ పోయింది. ఆ తర్వాత వేగంగా పడిపోవడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ వాటా విలువను హెచ్ఎస్ బీసీ సున్నాగా తేల్చింది.

కరోనా ప్రభావం తగ్గడంతో స్కూళ్లు తిరిగి తెరుచుకోవడం స్టార్ట్ కావడంతో బైజూస్ కు ఆదరణ తగ్గిపోవడం మొదలైంది. ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టిన కంపెనీ.. పలు స్కూళ్లతో ఒప్పందం కుదుర్చుకుని మార్కెట్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది. అయితే, ఈ ప్రయత్నంలో మేనేజ్ మెంట్ నిర్ణయాలు బెడిసికొట్టడంతో బైజూస్ ప్రభ క్షీణించడం మొదలైంది. ఓ దశలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక కొంతకాలం సహకరించాలంటూ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ అర్థించారు.

ఆ తర్వాత తన ఇంటిని తాకట్టు పెట్టి జీతాలు చెల్లించారు. మరోవైపు, కంపెనీని పలు కోర్టు కేసులు చుట్టుముట్టాయి. అటు ఆదాయం తీవ్రంగా పడిపోయి ఇటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకున్న బైజూస్ కంపెనీ వాల్యూను హెచ్ఎస్ బీసీ సున్నాగా ప్రకటించింది. కంపెనీల ఆర్థిక స్థితిగతులను పరిశీలించి హెచ్ఎస్ బీసీ వాటికి రేటింగ్స్ ఇస్తుంది. తాజాగా హెచ్ఎస్ బీసీ విడుదల చేసిన ఓ నివేదికలో బైజూస్ కంపెనీకి నెగెటివ్ రేటింగ్ ఇచ్చింది.


More Telugu News