'ఈనాడు' రామోజీరావు అస్త‌మ‌యం

  • గ‌త కొంత‌కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధ‌ప‌డుతున్న రామోజీరావు
  • ఆరోగ్యం క్షీణించ‌డంతో హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలోని స్టార్ ఆసుప‌త్రిలో చికిత్స‌
  • వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచిన రామోజీరావు
తెలుగు మీడియా మొఘల్‌గా పేరుపొందిన ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు కన్నుమూశారు. 88 ఏళ్ల ఆయ‌న‌ వయసు రీత్యా తీవ్ర అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నానక్ రామ్ గూడలోని స్టార్ ఆసుప‌త్రికి తరలించారు. వెంటిలేటర్‌పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. 

ఈ నెల 5న ఆయ‌న‌కు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది త‌లెత్త‌డంతో ప‌రీక్షించిన‌ వైద్యులు స్టెంట్ అమ‌ర్చారు. స్టెంట్ వేసిన త‌ర్వాత ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి కొంచెం క్రిటిక‌ల్‌గా మార‌డంతో ఆసుప‌త్రిలో చేర్పించారు. ఇక 88 ఏళ్ల రామోజీరావు గ‌త కొంత‌కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో కూడా ఆయన ఆసుప‌త్రిలో చికిత్స పొందారు.

కాగా, రామోజీరావు మీడియాతోపాటు అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనాడు సంస్థలు, రామోజీ ఫిల్మ్‌ సిటీ, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌, ప్రియా ఫుడ్స్‌, ఈటీవీ వంటి వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీరావు నడిపిస్తున్నారు. తెలుగు మీడియాలో ప్రధానమైన ఈనాడు సంస్థ ఆయన ఆధ్వర్యంలోనే కొనసాగుతున్న విషయం విదిత‌మే.


More Telugu News