ఎన్నికల ఫలితాల తర్వాత భారీగా పెరిగిన నారా భువనేశ్వరి, లోకే‌శ్‌ల సంపద

  • కేవలం రోజుల్లోనే భువనేశ్వరి సంపద రూ.535 కోట్లు పెరుగుదల
  • నారా లోకేశ్ ఆస్తి రూ.237 కోట్లు వృద్ధి
  • 5 రోజుల్లో 55 శాతం మేర పెరిగిన హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు
  • కంపెనీలో షేర్ హోల్డర్లుగా ఉన్న భువనేశ్వరి, నారా లోకేశ్
లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ప్రమోటర్లుగా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ ఈక్విటీ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషిస్తుండడంతో కేవలం 5 రోజుల్లోనే కంపెనీ షేర్లు ఏకంగా 55 శాతం మేర ఎగబాకాయి. ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందు రోజు.. అంటే జూన్ 3న రూ.424 వద్ద ఉన్న షేర్ విలువ శుక్రవారం మార్కెట్లు ముగింపు సమయానికి ఏకంగా రూ.661.25కు వృద్ధి చెందింది. 

దీంతో కంపెనీ ప్రమోటర్‌గా ఉన్న చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సంపద ఏకంగా రూ.579 కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈ డేటా ప్రకారం నారా భువనేశ్వరి కంపెనీలో టాప్ షేర్ హోల్డర్‌గా ఉన్నారు. ఆమె చేతిలో  2,26,11,525 షేర్లు ఉన్నాయి. ఇక ఈ కంపెనీలో 1,00,37,453 షేర్లు కలిగివున్న ఆమె కుమారుడు నారా లోకేశ్ సంపద కేవలం 5 రోజుల్లో రూ.237.8 కోట్ల మేర వృద్ధి చెందింది.

హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీని నారా చంద్రబాబు 1992లో స్థాపించారు. పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న ఈ కంపెనీ తన వ్యాపారాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఇండియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పబ్లిక్-లిస్టెడ్ కంపెనీలలో ఒకటిగా హెరిటేజ్ ఫుడ్స్ ఉందని కంపెనీ వెబ్‌సైట్ పేర్కొంది. డెయిరీ, పునరుత్పాదక శక్తి వ్యాపార విభాగాలుగా ఉన్నాయని వివరించింది.


More Telugu News