అమెరికా చేతిలో ఓడిన పాకిస్థాన్‌కు మరో షాక్!

  • పాక్ పేసర్ హారీస్ రౌఫ్‌పై 'బాల్ ట్యాంపరింగ్' ఆరోపణలు
  • మ్యాచ్‌ సమయంలో రౌఫ్ బంతిని గీకాడన్న అమెరికా సీనియర్ జట్టు సభ్యుడు
  • ఐసీసీని ట్యాగ్ చేసి ఎక్స్ వేదికగా ఆరోపణ
టీ20 వరల్డ్ కప్‌2024లో భాగంగా గురువారం రాత్రి పసికూన అమెరికా చేతిలో ఓడిన పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ హారిస్ రౌఫ్‌పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా సీనియర్ జాతీయ క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్న దక్షిణాఫ్రికా మాజీ పేసర్ రస్టీ థెరాన్ సోషల్ మీడియా వేదికగా ఈ ఆరోపణలు చేశారు. ‘ఎక్స్’ వేదికగా ఐసీసీని ట్యాగ్ చేసి హారీస్ రౌఫ్‌పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు గుప్పించాడు.

మ్యాచ్‌ సమయంలో రౌఫ్ తన గోళ్లతో కొత్త బంతిని గీకాడని, అమెరికన్ బ్యాటర్లను ఔట్ చేయాలని భావించాడని పేర్కొన్నాడు. ‘‘ఐసీసీ.. కొత్తగా తీసుకున్న బంతిని పాకిస్థాన్‌ గీకడం లేదని అంటూ మేము నటించాలా? 2 ఓవర్ల క్రితమే మార్చిన బంతిని తిప్పి పంపించడానికా? హారిస్ రౌఫ్ తన బొటనవేలుని బంతిపై గీకడం మీరే చూడవచ్చు’’ అని రస్టీ థెరాన్ పేర్కొన్నాడు. కాగా ఈ ఘటనపై అమెరికా టీమ్ అధికారికంగా ఐసీసీకి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కాగా ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన రౌఫ్ 37 పరుగులిచ్చి 1 వికెట్ మాత్రమే పడగొట్టాడు.


More Telugu News