తెలంగాణ, కర్ణాటకలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడినా... ఇప్పుడక్కడ బీజేపీని ఆదరించారు: మోదీ

  • కాంగ్రెస్‌ను గెలిపించినా త్వరగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని వ్యాఖ్య
  • మద్దతుగా నిలిచిన ఎన్డీయేకు ధన్యవాదాలు తెలిపిన మోదీ
  • ఎన్డీయే కూటమి 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని వెల్లడి
  • ఎన్డీయేలోని ప్రతి ఎంపీ తనకు సమానమేనని వ్యాఖ్య
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని... కానీ చాలా త్వరగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ప్రజలు ఎన్డీయేను ఆదరించారన్నారు. పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాలులో శుక్రవారం జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో... మోదీని నాయకుడిగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలు, టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జన శక్తి (పాశ్వాన్), ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదల్ సహా మిత్రపక్షాల ఎంపీలు, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నితీశ్ కుమార్, ఏక్‌నాథ్ షిండే తదితరులు హాజరయ్యారు. తనను ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్న అనంతరం మోదీ మాట్లాడారు.

తమకు మద్దతుగా నిలిచిన ఎన్డీయే మిత్రపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీయే పక్ష నేతగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాత్రింబవళ్ల కష్టానికి ఇది ఫలితమన్నారు. అధికారంలోకి రావడానికి కార్యకర్తలు అహర్నిశలు శ్రమించారని గుర్తు చేసుకున్నారు. రాత్రింబవళ్లు కష్టపడిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. మద్దతుగా నిలిచిన ఎన్డీయే  మిత్రపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి నేతగా ఎన్నుకున్న ఎన్డీయే నేతలకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. ఎన్టీయే 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని... ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాల్లోని 7 చోట్ల మనమే అధికారంలో ఉన్నామన్నారు.

తాము అన్ని మతాలు సమానం అనే సూత్రానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఎన్డీయేలోని ప్రతి ఎంపీ తనకు సమానమే అన్నారు. మన కూటమి అసలైన భారత స్ఫూర్తిని చాటుతుందన్నారు. మన కూటమి భారత్ ఆత్మగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎప్పుడూ విజయం సాధించలేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం అవసరమన్నారు. దేశాన్ని నడపాలంటే సర్వసమ్మతం అవసరమని అభిప్రాయపడ్డారు. దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళతామని హామీ ఇస్తున్నానన్నారు.


More Telugu News