ర‌ష్యాలో ఘోర విషాదం.. నీట మునిగి న‌లుగురు భార‌తీయ విద్యార్థుల మృతి!

  • న‌దిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన న‌లుగురు భార‌తీయ వైద్య విద్యార్థులు
  • సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్ స‌మీపంలోని న‌దిలో మునిగిపోయిన‌ట్లు అధికారుల వెల్ల‌డి
  • విద్యార్థుల మృతదేహాల‌ను స్వ‌దేశానికి పంపించేందుకు భార‌త‌ ఎంబ‌సీ చ‌ర్య‌లు
ర‌ష్యాలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. న‌లుగురు భార‌తీయ వైద్య విద్యార్థులు న‌దిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్ స‌మీపంలో ఉన్న న‌దిలో వాళ్లు మునిగిపోయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఆ విద్యార్థుల మృత‌దేహాల‌ను భార‌త్‌కు పంపించేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు భార‌త రాయ‌బార కార్యాల‌యం వెల్ల‌డించింది.  

కాగా, మృతిచెందిన విద్యార్థులు నోవోగ‌రోడ్ సిటీలోని స్టేట్ యూనివ‌ర్సిటీలో వైద్య విద్య‌ను అభ్య‌సిస్తున్నట్లు తెలిసింది. 18 నుంచి 20 ఏళ్ల మ‌ధ్య ఉన్న ఇద్ద‌రు అమ్మాయిలు, ఇద్ద‌రు అబ్బాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఓ అమ్మాయి న‌ది నీటిలో కొట్టుకుపోతున్న స‌మ‌యంలో ఆమెను ర‌క్షించేందుకు మిగతా ముగ్గురు న‌దిలోకి దిగారు. అయితే వాళ్లు కూడా ఆ న‌ది నీటిలో కొట్టుకుపోయారు. వాళ్ల‌తో ఉన్న మ‌రో ఓ విద్యార్థి మాత్రం ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డ్డారు. 

బంధువుల‌కు మృత‌దేహాల‌ను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ఓ విద్యార్థికి చికిత్స అందిస్తున్న‌ట్లు మాస్కోలోని ఇండియ‌న్‌ ఎంబ‌సీ పేర్కొంది. బాధిత బంధువుల‌కు సమాచారాన్ని చేర‌వేసిన‌ట్లు రాయ‌బార కార్యాల‌యం అధికారులు తెలియ‌జేశారు.


More Telugu News