ఎన్డీయే పక్ష నేతగా మోదీ పేరు ప్రతిపాదించిన రాజ్ నాథ్... బలపరిచిన చంద్రబాబు తదితరులు

  • ఎంపీలు, పవన్ కల్యాణ్‌తో కలిసి ఎన్డీయే సమావేశానికి చంద్రబాబు
  • మోదీ పదేళ్ల పాలనపై ప్రశంస
  • మోదీలాంటి శక్తిమంతమైన నేతను తానెక్కడా చూడలేదన్న బాబు
  • ప్రధాని పదవికి మోదీ పేరును ప్రతిపాదించగానే కరతాళ ధ్వనులు
  • మోదీని బలపరిచిన నితీశ్‌కుమార్ సహా ఎన్డీయే నేతలు
ఢిల్లీలోని పార్లమెంట్ సంవిధాన్ భవన్‌లో జరుగుతున్న ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు, పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. మోదీ పక్కనే చంద్రబాబు, ఆ పక్కన నితీశ్ కుమార్ కూర్చున్నారు. లోక్‌సభ పక్షనేతగా మోదీ పేరును చంద్రబాబు బలపరిచారు. 

సమావేశంలో బీజేపీ చీఫ్ నడ్డా మాట్లాడుతూ ఏపీలోనూ ఎన్డీయే సర్కారు కొలువుదీరబోతున్నదని చెప్పారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో మూడోసారి అధికారంలోకి వచ్చినట్టు తెలిపారు. 

అనంతరం, లోక్ సభలో ఎన్డీయే పక్ష నేతను ఎన్నుకునే ప్రక్రియకు రాజ్ నాథ్ సింగ్ శ్రీకారం చుట్టారు. ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును లాంఛనంగా ప్రతిపాదించారు. ఈ క్రమంలో మోదీ నాయకత్వాన్ని అమిత్ షా, నితిన్ గడ్కరీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఏక్ నాథ్ షిండే, కుమారస్వామి, అజిత్ పవార్ తదితరు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు బలపరిచారు. తద్వారా లోక్ సభలో ఎన్డీయే సభా పక్ష నేతగా మోదీ ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం ఎన్డీయే నేతలందరూ నరేంద్రమోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాని మోదీ గత మూడు నెలలుగా ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా గడిపారని పేర్కొన్నారు. ఏపీలో మూడు బహిరంగ సభలు, ఒక భారీ ర్యాలీ నిర్వహించినట్టు గుర్తుచేశారు. హోంమంత్రి అమిత్‌షా ఏపీలో నిర్వహించిన సభతో ఎన్నికల స్వరూపమే మారిపోయిందని కొనియాడారు. భారీ మెజార్టీ రావడానికి అది కూడా కారణమంటూ ధన్యవాదాలు తెలిపారు. నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్ వంటి వారు కూడా ప్రచారానికి రావడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. 

మోదీ నేతృత్వంలోని భారతదేశం గత పదేళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందని కొనియాడారు. ఆయన నేతృత్వంలోనే భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందని ప్రశంసించారు. ఇప్పుడు వికసిత్ భారత్, ప్లాన్ 2047పై ప్రణాళికలు రూపొందించారని, వీటిని చేరుకుంటామని తాము పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రపంచంలో భారత్ అగ్రరాజ్యంగా, లేదంటే రెండో స్థానానికి ఎదుగుతుందని పేర్కొన్నారు. దేశానికి సరైన సమయంలో, సరైన వ్యక్తి దొరికారని ప్రశంసించారు. తాను ఎంతోమంది నేతలను చూశాను కానీ, మోదీ లాంటి శక్తిమంతమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదన్నారు. 




More Telugu News