మంత్రివర్గంలో లోకేశ్‌కు కీలక బాధ్యతలు.. చంద్రబాబు నిర్ణయం!

  • టీడీపీ విజయంలో లోకేశ్ కీలక పాత్ర
  • లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు చంద్రబాబు నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం
  • గతంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న లోకేశ్
  • ఈమారు మరిన్ని కీలక బాధ్యతలు దక్కే అవకాశం
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏపీ మంత్రి వర్గంలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రాధాన్యమున్న బాధ్యతలు ఆయనకు అప్పగించేందుకు టీడీపీ అధినేత నిర్ణయించినట్టు సమాచారం. ఎన్డీయే విజయంలో లోకేశ్ కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్రతో రాష్ట్రమంతా పర్యటించారు. అయితే, ఓ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచాక మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీ పరంగా బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించారు. ఇక ఓట్ల లెక్కింపు అనంతరం మరోసారి మీడియాతో మాట్లాడుతూ తనకు పార్టీ నిర్ణయం శిరోధార్యం అన్నారు. దీంతో, మంత్రివర్గంలో లోకేశ్ పాత్రపై ఉత్కంఠ నెలకొంది. 

ఈ నేపథ్యంలో చంద్రబాబు లోకేశ్‌ను మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బయట ఉంటే కీలక విధాన నిర్ణయాలు, వాటి అమల్లో లోకేశ్‌కు భాగస్వామ్యం ఉండదన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారట. లోకేశ్ గతంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి ప్రభుత్వంలో మరింత కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.


More Telugu News