బీజేపీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

  • అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణం జరిగిందన్న కాంగ్రెస్ అగ్రనేత
  • స్టాక్ మార్కెట్స్‌లో పెట్టుబడులు పెట్టాలని మోదీ, అమిత్ షా ఎందుకు అన్నారని ప్రశ్నించిన రాహుల్
  • ఎగ్జిట్ పోల్స్, బీజేపీకి సంబంధం ఏంటని నిలదీసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ నరేంద్ర మోదీ, అమిత్ షా ఇద్దరూ ఎన్నికల ప్రచార సమయంలో ఇన్వెస్టర్లకు ఎందుకు సలహా ఇచ్చారని, ఇదొక పెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణమని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో (జేపీసీ) విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ఐదు కోట్ల కుటుంబాలకు పెట్టుబడి సలహా ఎందుకు ఇచ్చారంటూ రాహుల్ గాంధీ సందేహాలు వ్యక్తం చేశారు. పెట్టుబడి సలహా ఇవ్వడం వారి పనా అని నిలదీశారు. సెబీ విచారణలో ఉన్న ఒక బిజినెస్ గ్రూపునకు చెందిన ఒకే మీడియా గ్రూపునకు ఇద్దరూ ఎందుకు ఇంటర్వ్యూలు ఇచ్చారని, స్టాక్ మార్కెట్‌ను తారుమారు చేయడానికా అని రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించారు.

బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ సంబంధం ఏంటని, ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఒక రోజు ముందు పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన విదేశీ నకిలీ ఇన్వెస్టర్లతో బీజేపీకి సంబంధం ఏంటని అన్నారు. జీతాలపై ఆధారపడిన ఐదు కోట్ల మంది ఇన్వెస్టర్ల పెట్టుబడులతో వారు లాభపడ్డారని పేర్కొన్నారు. ఈ స్కామ్‌పై జేపీసీ ఏర్పాటు చేయాలని, ఇది స్కామ్ అని తాను భావిస్తున్నామని, భారతీయ రిటైల్ పెట్టుబడిదారుల సొమ్ముతో ఎవరో వేల కోట్ల రూపాయలు సంపాదించారని రాహుల్ ఆరోపించారు. ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి ఇద్దరూ పెట్టుబడుల సలహా ఇచ్చారు కాబట్టి విచారణ జరపాలని అన్నారు.

కాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలను తాకుతాయని మే 23న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. జూన్ 4న బీజేపీ రికార్డు స్థాయి విజయం సాధిస్తుందని, స్టాక్ మార్కెట్ కూడా కొత్త రికార్డులను సృష్టిస్తుందని తాను నమ్మకంగా చెప్పగలనని అన్నారు.


More Telugu News