మా సమాచారం తెలుసుకురమ్మని అతనిని పోలీసులే అడవుల్లోకి పంపారు: మావోయిస్టుల వివరణ

  • లేఖ విడుదల చేసిన మావోయిస్టు కార్యదర్శి శాంత
  • బూబీ ట్రాప్ తొక్కడంతో ప్రాణాలు కోల్పోయిన ఏసు
  • ఆదివాసీలు తిరిగే ప్రాంతాల్లో మందుపాతర అమర్చలేదని వివరణ
ప్రజలు తిరిగే ప్రాంతాల్లో తాము మందుపాతరలను అమర్చడంలేదని, ఎత్తైన గుట్ట ప్రాంతంలోనే పలు బూబీ ట్రాప్ లను అమర్చామని మావోయిస్టులు పేర్కొన్నారు. కొంగాల అడవుల్లో కర్రిగుట్టపై ఇల్లందుల ఏసు చనిపోవడంపై తాజాగా స్పందించారు. ఏసు మరణానికి మావోయిస్టులు అమర్చిన బూబీ ట్రాప్ కారణమని ఆరోపణలు వినిపించాయి. కర్రిగుట్టపై వేటకు వెళ్లిన ఏసు.. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలుడు వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నాడని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు స్పందిస్తూ.. మావోయిస్టు కార్యదర్శి శాంత పేరుతో ఓ లేఖ విడుదల చేశారు. ఇల్లందుల ఏసు మరణంపై విచారం వ్యక్తం చేశారు.

ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను, అమాయక ఆదివాసీలను పోలీసులు చంపేస్తున్నారని శాంత ఆరోపించారు. ఇందులో భాగంగానే మావోయిస్టుల సమాచారం తెలుసుకురావాలని ఏసును పోలీసులే అడవుల్లోకి పంపారని ఆరోపించారు. ఆదివాసీలు తిరిగే ఏరియాలలో తాము మందుపాతరలను అమర్చలేదని స్పష్టం చేశారు. కర్రిగుట్టపై బూబీ ట్రాప్ లను అమర్చిన విషయం నిజమేనని, అయితే, ఆ విషయం చుట్టుపక్కల నివసిస్తున్న ఆదివాసీలకు తెలియజేశామని పేర్కొన్నారు. ఆ గుట్టవైపుగా వెళ్లొద్దని అందరినీ హెచ్చరించినట్లు తెలిపారు. అయితే, పోలీసుల ఒత్తిడి కారణంగా ఇల్లందుల ఏసు బలవంతంగా ఆ గుట్టపైకి వెళ్లి ట్రాప్ లో ఇరుకున్నాడని, బాంబు పేలడంతో ప్రాణాలు కోల్పోయాడని మావోయిస్టులు చెప్పారు. ఏసు మృతికి పోలీసులే బాధ్యత వహించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.


More Telugu News