టీ20 ప్రపంచకప్: ఓడినా ఆస్ట్రేలియాకు ఎదురొడ్డిన పసికూన ఒమన్

  • విజయంతో ప్రపంచకప్ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆసీస్
  • ఒమన్‌పై 39 పరుగుల తేడాతో విజయం
  • వార్నర్, స్టోయినిస్ అర్ధ సెంచరీలు
  • బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చక్కని ప్రదర్శన కనబరిచిన ఒమన్
ప్రపంచకప్‌లో భాగంగా బార్బడోస్‌లో పసికూన ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 165 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఒమన్‌ను 125 పరుగులకే కట్టడి చేసి ప్రపంచకప్‌ను విజయంతో ప్రారంభించింది.

ఆస్ట్రేలియా నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్ త్వరత్వరగానే వికెట్లు కోల్పోయినప్పటికీ అయాన్ ఖాన్ క్రీజులో నిలదొక్కుకుని బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. జట్టు ఓటమి పాలైనప్పటికీ అయాన్ ఖాన్, మెహ్రాన్ ఖాన్ ప్రదర్శించిన తెగువ అభిమానులను ఆకట్టుకుంది. అంతకుముందు బౌలింగ్‌లోనూ జట్టు మంచి ప్రదర్శన కనబరిచింది. ఆసీస్ భారీ స్కోరు చేయకుండా నిలువరించింది.

అయాన్ ఖాన్ 30 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 36, మెహ్రాన్ ఖాన్ 16 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో 27 పరుగులు చేశారు. కెప్టెన్ అకీబ్ ఇయాస్ 18 పరుగులు చేశాడు. మొత్తంగా 20 ఓవర్లు క్రీజులో నిలిచిన ఒమన్ 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి విజయానికి 40 పరుగుల దూరంలో నిలిచింది. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టోయినిస్ 3, ఆడం జంపా, నాథన్ ఎల్లిస్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ వార్నర్ (56), ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్‘ స్టోయినిస్ (67) అర్ధ సెంచరీలతో రాణించారు.


More Telugu News