జైల్లో నుంచే లోక్ సభకు ఎంపిక.. రూల్స్ ఏమంటున్నాయంటే..!

  • ప్రమాణ స్వీకారం చేయొచ్చు కానీ సమావేశాలకు హాజరయ్యే ఛాన్స్ లేదు
  • రెండేళ్ల శిక్ష పడితే సభ్యత్వం రద్దు
  • లోక్ సభకు ఎన్నికైన అమృత్ పాల్ సింగ్, ఇంజినీర్ రషీద్
జైలులో నుంచి లోక్ సభకు పోటీ చేసిన అమృత్ పాల్ సింగ్, ఇంజినీర్ రషీద్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, జైలులో ఉన్న ఈ ఇద్దరు ఎంపీల విషయంలో తర్వాత ఏం జరగనుంది.. చట్టాలు ఏం చెబుతున్నాయంటే..? చట్ట సభలకు ఎంపికైన వ్యక్తికి రాజ్యాంగం ప్రకారం  ప్రమాణస్వీకారం చేసే హక్కు ఉంటుంది. ఎంపికైన ఇతర చట్ట సభ్యుల మాదిరిగానే వీరు కూడా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. అయితే, జైలు అధికారుల ఎస్కార్ట్ తో పార్లమెంట్ కు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత తిరిగి జైలుకు చేరుకోవాల్సిందే. ఎంపీగా ప్రమాణం చేసినప్పటికీ జైలులో ఉన్న కారణంగా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే వీలుండదు. జైలులో ఉన్న కారణంగా సమావేశాలకు హాజరు కాలేకపోతున్నామని సభాపతికి లేఖ రాయాల్సి ఉంటుంది. స్పీకర్ ఈ లేఖను హౌస్ కమిటీ ముందుంచుతారు. ఈ విషయంపై హౌస్ కమిటీలో చర్చ జరిగి, జైలులో ఉన్న సభ్యులకు హాజరు నుంచి మినహాయింపు కల్పించేందుకు కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసి, దానిని సభలో ఓటింగ్ కు పెడుతుంది. 

ఒకవేళ శిక్షపడితే..
జైలులో ఉన్న చట్ట సభ్యుల నేరం నిరూపణ అయి, న్యాయస్థానం వారికి శిక్ష విధించిన పక్షంలో.. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడితే సదరు చట్ట సభ్యుడు తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 (4) ప్రకారం.. న్యాయస్థానం ఖారారు చేసిన జైలు శిక్షపై పైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి 3 నెలల సమయం ఉంటుంది.


More Telugu News